ఇక పెద్దాసుపత్రుల్లోనే కు.ని. ఆపరేషన్లు

5 Sep, 2022 03:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/లక్డీకాపూల్‌: మత్తు మందు వైద్యులు, ఐసీయూ, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సౌకర్యమున్న పెద్దాసుపత్రుల్లోనే ఇక నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం కు.ని. ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతిచెందిన ఘటనపై ఉన్నతాధికారులతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై నిష్పాక్షికంగా విచారణ నిర్వహించాలని, అన్ని అంశాలతో సమగ్ర నివేదిక అందజేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కావొద్దని హరీశ్‌రావు ఆదేశించారు. ఆపరేషన్లు అయిన మహిళలను ఆసుపత్రుల్లో ఒకరోజు పరిశీలనలో ఉంచి, ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారణ అయిన తర్వాతే ఇంటికి పంపించాలని సూచించారు.

కాగా ఇబ్రహీంపట్నంలో గంటన్నరలోనే 34 మందికి కు.ని. ఆపరేషన్లు నిర్వహించినట్లుగా అధికారులు వెల్లడించినట్లు తెలిసింది. ఆపరేషన్‌కు, ఆపరేషన్‌కు మధ్య పరికరాలను శుభ్రంగా చేసేందుకు అవసరమైన సమ­యం కూడా తీసుకోలేదని తమ పరిశీలనలో తే­లిం­దని, ఇన్ఫెక్షన్‌ వల్లనే బాధితులు మృతిచెంది­నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. అంత హడావిడి­గా ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనీ, మహిళల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించకుండానే పంపించడం ఏమిటని మంత్రి అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇకనుంచి ఇ­లాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ మాత్రం నిర్లక్ష్యం జరిగినా సంబంధిత జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి హరీశ్‌ హెచ్చరించినట్లు సమాచారం. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగే ఆసుపత్రులను  పరిశీలించాలని, లోపాలను సరిదిద్దాల­ని ఆదేశించినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు కొందరు ఆఫీసులకే పరిమితమవుతున్నారని, వా­రా­నికి ఒకసారైనా ఆసుపత్రులను సందర్శించకపోవడమేమిటని మంత్రి తప్పుబట్టినట్లు తెలిసింది.  

డెంగీ నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలి... 
ఇంటి చుట్టూ, ఇంటి లోపల నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, డెంగీ నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. చార్మినార్‌ జోన్‌ సీనియర్‌ ఎంటమాలొజిస్టు నామాల శ్రీనివాస్, మిగతా నాయకులతో కలిసి డెంగీ వ్యాధి నివారణ కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. అందులో భాగంగా నగరంలోని తన ఇంటి ఆవరణలో 10 గంటలకు 10 నిమిషాలపాటు నీటి నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ‘ఆదివారం 10 క్లాక్‌ 10 మినిట్స్‌ క్యాంపెయిన్‌’వీడియో, ప్రచార సామగ్రిని విడుదల చేశారు.    

మరిన్ని వార్తలు