కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణయాన్ని మార్చుకోవాలి

2 Nov, 2021 01:58 IST|Sakshi
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న హరీశ్‌రావు

దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులకు ఇబ్బంది  

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, సిద్దిపేట: దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు చేయని పక్షంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కృషి వల్లే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగిందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉండగా.. తెలంగాణ ఏర్పడ్డాక 35 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించామన్నారు. ఎంత పంట వచ్చినా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందడం లేదన్నారు. యాసంగిలో పారా బాయిల్డ్‌ రైస్‌ కొనాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ మూడు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్ష నాయకులు ఊరికే నోరు పారేసుకోవడం సరికాదని, కేంద్రాన్ని ఒప్పించి బాయిల్డ్‌ రైస్‌ కూడా కొనుగోలు చేసేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్‌ డేవిస్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు