త్వరలో 50 వేల ఉద్యోగాలు

6 Jan, 2021 03:09 IST|Sakshi

తక్కువ నిరుద్యోగులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది మూడో స్థానం

‘ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం’డైరీ ఆవిష్కరణలో మంత్రి హరీశ్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ రంగంలో గడిచిన ఆరున్నరేళ్లలో 1.28 లక్షల ఉద్యోగాల భర్తీ జరిగిందని, త్వరలో మరో 50వేల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన ‘తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం’డైరీ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. దేశంలో నిరుద్యోగులు అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు.

టీఎస్‌ఐపాస్‌ ద్వారా రాష్ట్రానికి 14వేల పరిశ్రమలు వచ్చాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా 15 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. పారిశ్రామిక ఐటీ సంస్థల ఏర్పాటుకు అనువైన మౌలిక వసతులు, పారదర్శక విధానాలు, శాంతిభద్రతలు ఉండటంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వ రంగంలో అనేక మందికి పదోన్నతి లభించడంతో కొత్త ఉద్యోగాల కల్పన సాధ్యమవుతోందని హరీశ్‌ అన్నారు.  

మీ అభిమానం మా గుండెల్లో..: రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలు తెలంగాణ భావజాల, ఉద్యమ వ్యాప్తికి ఎంతో దోహదం చేశాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘ఉద్యమ సమయంలో మీరు చూపిన ప్రేమ, అభిమానం మా గుండెల్లో ఉంటుంది. మిలియన్‌ మార్చ్, సాగరహారం వంటి కార్యక్రమాల్లో 
తుపాకీ దెబ్బలు తింటూ పాల్గొన్నాం, జైలు బాట పట్టాం’అని అన్నారు. 

వ్యవసాయ డైరీ, కేలండర్‌ ఆవిష్కరణలో హరీశ్‌రావు 
సుల్తాన్‌బజార్‌ (హైదరాబాద్‌): తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శంగా మారేలా అధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్‌ ఆడిటోరియంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం వ్యవసాయ డైరీ, కేలండర్‌–2021 ఆవిష్కరణ సభకు ఆయన హాజరయ్యారు. వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి డైరీ, కేలండర్లను ఆవిష్కరించారు.  అలాగే మంగళవారం అరణ్య భవన్‌లో..‘రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం డైరీ– 2021’ని సైతం మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు