వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేక పాలసీ

8 May, 2022 01:16 IST|Sakshi

రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి వెల్లడి 

దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పద్ధతి లేదన్న హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: విప్లవాత్మక మార్పులతో వైద్యసేవలను విస్తృతం చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. బయో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ మెయింటెనెన్స్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి పద్ధతిని అమలు చేయడంలేదని చెప్పారు.

వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోని ఆస్పత్రుల పనితీరుపై శనివారం మంత్రి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని అన్ని వైద్య పరికరాలను పదిరోజుల్లోగా వార్షిక నిర్వహణ కాంట్రాక్టు పరిధిలోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వైద్య పరికరాల వినియోగం సమర్థవంతంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  

అవసరం లేకున్నా హైదరాబాద్‌కు రోగులను రిఫర్‌ చేయొద్దు 
అవసరం లేకున్నా హైదరాబాద్‌కు రోగులను రిఫర్‌ చేయొద్దని, వారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని హరీశ్‌రావు అన్నారు. జిల్లాస్థాయిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సాధారణ ప్రసవాలు పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అన్ని ఏరియా ఆస్పత్రుల్లో కాటరాక్ట్‌ ఆపరేషన్లు చేయాలన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, మెడికల్‌ షాపులకు మందులు రాయొద్దని మంత్రి ఆదేశించారు. ఆదేశాలను ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేసవివేళ ఆస్పత్రుల్లో తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వచ్చేనెల సమీక్ష నాటికి పనితీరులో మరింత పురోగతి సాధించాలని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్‌ శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎం.డి. చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు