కరోనాను ఎదిరించి నిలిచాం: హరీశ్‌రావు 

19 Mar, 2021 03:03 IST|Sakshi
బడ్జెట్‌ ప్రతులతో హరీశ్‌రావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు

అన్ని విభాగాలు కుప్పకూలినా వ్యవ‘సాయం’పురోగమించింది 

ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఫలితం... బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు 

జాతీయ వృద్ధి రేటు కంటే మన రాష్ట్రమే భేష్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సంక్షోభ సమయంలో కూడా తెలంగాణ పల్లెలు తట్టుకుని నిలబడ్డాయని.. ఇది రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపు ఫలితమని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కొన్నేళ్లుగా బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు కల్పించిన వాణిజ్య సేవలు, సమాచార, సాంకేతిక, స్థిరాస్తి నిర్మాణ రంగాలు కరోనా కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాయని.. కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం వ్యవసాయమని చెప్పారు. కష్టకాలంలోనూ తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధి క్రియాశీలకంగా ఉందని.. గత ప్రభుత్వాలు దండగ అని ఈసడించిన వ్యవసాయమే నేడు కరోనాను తట్టుకుని అభివృద్ధి సాధించిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో తీసుకున్న ఉద్దీపన చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) బడ్జెట్‌ అంచనాలను హరీశ్‌రావు గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు.

రూ.2,30,825.96 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు, క్యాపిటల్‌ వ్యయం రూ.29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లు, ఆర్థిక లోటు రూ.45,509.60 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు, సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని, వాటన్నింటినీ చాకచక్యంగా అధిగమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడిచిందని హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కిందని, సంక్షేమంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని పేర్కొన్నారు. ప్రజల నుంచి గొప్ప సహకారం, అండదండలు లభించాయన్నారు. దేశ ఆదాయం తగ్గిన పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఆదాయం పెరిగిందని.. నేడు తెలంగాణ ఒక ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతోందని స్పష్టం చేశారు. 

ముందుచూపుతోనే బయటపడ్డాం 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాలవారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ఇప్పుడు కరో నా కష్టకాలంలో కలిసి వచ్చాయని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శాఖల వారీగా కేటాయింపులు, ఇంతకాలం ప్రభుత్వం చేసిన కృషితో ఆయా శాఖ ల్లో జరిగిన పురోగతి వివరాలను అంకెలతో సభ ముందుంచారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఇంటా, బయటా మన్ననలు పొందుతోంది. ఏడేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం.. ఏడు పదుల వయసున్న రాష్ట్రాలతో పోటీపడుతూ అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచింది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. ముందస్తు అంచనాల ప్రకారం.. 2020–21లో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) ప్రస్తుత ధరల ప్రకారం రూ.9,78,373 కోట్లుగా ఉంటుం దని అంచనా. లాక్‌డౌన్‌ కారణంగా 2019–20లో జీఎస్డీపీ 13.5 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది. జాతీయ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతం నుంచి మైనస్‌ 3.8 శాతానికి పడిపోయింది. జీడీపీ వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు మెరుగ్గా ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం వల్ల కరోనా సంక్షోభం చుట్టుముట్టినా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడింది. మెరుగైన విద్యుత్‌ సరఫరా, పెరిగిన సాగునీటి వసతి, రైతుబంధు, గొర్రెల పంపిణీ, చేపల పెంపకాన్ని విస్తృతం చేయటంతోపాటు పలు సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా 2020– 21లో ప్రాథమిక రంగం అంచనాలో 17.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది’’అని వివరించారు. 

తలసరి ఆదాయం పెరిగింది 
రాష్ట్ర తలసరి ఆదాయం 2020–21 సంవత్సరానికి రూ.2,27,145గా ఉంటుందని కేంద్ర గణాంక శాఖ అంచనా వేసిందని.. ఇది గతేడాది కంటే +0.6 శాతం ఎక్కువని హరీశ్‌రావు తెలిపారు. దేశ తలసరి ఆదాయం 2020–21కి రూ.1,27,768గా ఉంటుందని అంచనా వేశారని.. ఇది ముందటి ఏడాది కంటే 4.8 శాతం తక్కువ అని స్పష్టం చేశారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే ఏకంగా రూ.99,377 అధికంగా ఉందని తెలిపారు. అయితే కరోనా వల్ల ఆర్థిక రంగం పెద్ద కుదుపునకు లోనయిందని, దాన్ని అధిగమించేందుకు పకడ్బందీ ప్రణాళికతో రాష్ట్రం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీలో మంచి వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. 

భూ పరిపాలనలో సంస్కరణలు తెచ్చాం 
భూ పరిపాలనలో తెలంగాణ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని హరీశ్‌రావు చెప్పారు. ఎన్నడూ లేనట్టుగా భూరికార్డుల ప్రక్షాళనను ప్రారంభించామని, 95 శాతం భూముల యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చిందని వివరించారు. రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలు అందాయని.. వివరాలు స్పష్టంగా ఉండటంతో 60 లక్షల మంది రైతులకు ఏ ఇబ్బందీ లేకుండా రైతుబంధు అందించగలుగుతున్నామని తెలిపారు. 

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమంపై దృష్టి 
తెలంగాణ నుంచి బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన కార్మికులను సానుభూతితో ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని హరీశ్‌రావు చెప్పారు. ఆ దిశగా కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయడానికి ప్రత్యేక బృందం పర్యటించి వచ్చిందన్నారు. ఇక కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులకు ప్రోత్సాహకంగా రూ.235 కోట్లు ఇచ్చామన్నారు. జర్నలిస్టులు, న్యాయవాదులకూ సాయం అందించామని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ఆదాయం తగ్గకుండా ఉండేలా కృషి చేసిన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు–రిజిష్ట్రేషన్లు, రవాణా, గనుల శాఖల అధికారులను మంత్రి అభినందిం చారు.  అసెంబ్లీలో హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. మండలిలో మంత్రి వేముల సమర్పించారు. 


మొదలు.. ముగింపు.. దాశరథి మాటలతోనే..
సాధారణంగా బడ్జెట్‌ ప్రసంగాల్లో ప్రముఖుల మాటలు, చలోక్తులు ప్రస్తావిస్తుంటారు. హరీశ్‌రావు కూడా తాజా బడ్జెట్‌ ప్రసంగంలో మహాకవి దాశరథి చెప్పిన మాటలను ఉటంకించారు. దాశరథి మాటలతోనే ప్రసంగాన్ని ప్రారంభించి, ఆయన మాటలతోనే ముగించారు. ‘‘ఏదీ సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము’అని మహాకవి దాశరథి అన్నట్టు ఈ అద్భుతమైన రాష్ట్ర ప్రగతి కూడా అంత సులభంగా సాధ్యం కాలేదు. రాష్ట్రం ఏర్పడినప్పటి అస్పష్ట, గందరగోళ పరిస్థితులను ఛేదిస్తూ.. ఆదాయ, వ్యయాలను ఆకళింపు చేసుకుంటూ, నూతన రాష్ట్రానికి తగిన విధానాలతో వడివడిగా అడుగులు వేశాం..’’అని ప్రసంగం మొదట్లోనే హరీశ్‌రావు అన్నారు. ‘‘ధ్యేయాన్ని బట్టి ప్రతి పనీ దివ్యమగును’’అన్న దాశరథి మాటలను మేం ఆచరణలో పెడుతున్నాం. మా ధ్యేయం సకల జనుల సంక్షేమం, మా లక్ష్యం ప్రజల బతుకులు పండించే బంగారు తెలంగాణం. అట్టడుగున ఆఖరి వ్యక్తి దాకా ప్రగతి ఫలాలను అందిద్దాం. ప్రజలే చరిత్ర నిర్మాతలన్న విశ్వాసంతో మున్ముందుకు పురోగమిద్దాం. ప్రజలు కేంద్రంగా తెలంగాణ ప్రస్థానం కొనసాగుతుంది’అంటూ ప్రసంగాన్ని ముగించారు.  

రైతుల హృదయాల్లో సంతోషం నింపాం
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర చరిత్రలో ఓ అపురూప ఘట్టం. మేడిగడ్డ వద్ద సముద్రమట్టానికి వంద మీటర్ల ఎత్తులో ప్రవహించే గోదావరి నీటిని.. 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండ పోచమ్మ సాగర్‌ లోకి తీసుకువచ్చిన అద్భుత సన్నివేశానికి మనమంతా సాక్షులుగా నిలిచాం. రిజర్వాయర్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేశాం. యాసంగి పంటలకు నీళ్లిచ్చి రైతుల హృదయాల్లో సంతోషాన్ని నింపాం. ఇవాళ ఈ ప్రాజెక్టుల నీరందుతున్న ఏ ఊరికి పోయినా మా చెరువు నిండింది, మా కాల్వ పారింది, మా పొలం పండిందని సం బురంగా చెబుతున్నారు. మరింతగా సాగునీ టి సదుపాయాన్ని పెంచేందుకు ఈ బడ్జెట్లో రూ. 16,931 కోట్లు కేటాయిస్తున్నాం.’’

కేసీఆర్‌ అప్పుడు పాట రాశారు.. ఇప్పుడా కష్టాలు తీర్చారు 
‘‘చూడు చూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడు బండ. బొక్కలొంకరపోయిన బతుకులా మన నల్లగొండ. దుక్కమెల్లదీసేదెన్నాళ్లు..’.. ఇది నల్లగొండ తాగునీటి కష్టాలను చూసి కేసీఆర్‌ స్వయంగా రాసిన పాట. ఆయనే ఇప్పుడు ఫ్లోరైడ్‌ పీడను శాశ్వతంగా తొలగించి నల్లగొండ కష్టాలు తీర్చారు. నల్లగొండ ఫ్లోరైడ్‌ పీడ అంతమైందని, కొత్తగా ఎవరూ ఫ్లోరోసిస్‌ బారిన పడటం లేదని కేంద్రం పార్లమెంటు వేదికగా ప్రకటించింది. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర జల్‌ జీవన్‌ మిషన్‌ అధికారికంగా ప్రకటించింది.’’ 

మరిన్ని వార్తలు