కేంద్రం అబద్దాలు చెప్తూ ప్రచారం చేస్తోంది: హరీష్‌ రావు

23 Apr, 2022 16:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాదయాత్రలు చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి  హరీష్ రావు మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని నిజం లాగా చిత్రీకరిస్తూ.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టాక్సుల రూపేణా తెలంగాణ రాష్ట్రం ఎంత కట్టింది, కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఎంత అనేది తెలుసుకోవాలన్నారు.

రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన టాక్సులు ఎక్కవ, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది తక్కువని తెలిపారు. అనేక సార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు వినతి పత్రాలు  ఇచ్చామమని తెలిపారు. కానీ నిధులు ఇప్పటికి రాలేదని చెప్పారు. ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫార్సులను కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రం అబద్దాలు చెప్తూ ప్రచారం చేస్తుందని విమర్శించారు.

గవర్నర్ గుర్తించింది ఏమి లేదు
మెడికల్ సీట్ల గోల్ మాల్ ముందు గుర్తించింది తామేనని, పోలీసులకు పిర్యాదు చేసింది కూడా తామేనని హరీష్‌ రావు తెలిపారు. గవర్నర్ గుర్తించింది ఏమి లేదన్నారు. మెడికల్ సీట్ల గందరగోళం దందాను ఆపామని చెప్పారు. ప్రభుత్వం దీన్ని సరిచేసే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. కానీ, దీన్ని కావాలని ఏబీవీపీ రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. నీట్ ప్రవేశ పరీక్ష వచ్చినప్పటి నుంచే ఈ సమస్య వచ్చిందని అన్నారు. పోలీసు పిర్యాదుతోనే ఈ దందా వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు.

చదవండి: బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌నే మార్చి మరీ..

మరిన్ని వార్తలు