పార్లమెంటు సాక్షిగా కేంద్ర గిరిజన శాఖ మంత్రి అబద్ధాలు: హరీశ్‌రావు

23 Mar, 2022 04:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద నడుస్తోందని, కేంద్ర మంత్రులు పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అబద్ధాల కర్మాగారాన్ని నడుపుతోందని, ఆ పార్టీ బడా ఝూటా పార్టీ గా మారిందని ఎద్దేవా చేశారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి తెలంగాణ ప్రభు త్వం నుంచి ప్రతిపాదనలు అందలేదని పార్లమెంట్‌ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడిన కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ తుడును బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంత్రి మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.  

బేషరతుగా క్షమాపణ చెప్పాలి: కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తెలంగాణ గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానపరిచేలా ఉన్నందున బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీశ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని కోరుతూ అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపించిందన్నారు. గిరిజన రిజర్వేషన్ల గురించి పార్లమెంట్‌లో ప్రశ్నను లేవనెత్తిన కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.. అసెంబ్లీ గిరిజన రిజర్వేషన్ల బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సమయంలో ఎమ్మెల్యే గా ఉన్నారని, అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మద్దతు పలికారని గుర్తు చేశారు.

బిల్లు ఆమోదం సమయంలో ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ప్రతిపాదన రాలేదని కేం ద్రం చెప్పడం ఫూల్స్‌ (తెలివితక్కువ వారు) డ్రా మాలా ఉందని విమర్శించారు. గిరిజన రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం పొందిన తర్వా త 2017 మే 29న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపామని తెలిపారు. కేంద్రం నుంచి అందినట్లు సమాచారం కూడా వచ్చిందన్నారు. అలాగే సీఎం కేసీఆర్‌ 2018, 2019లో ప్రధాని మోదీకి లేఖ ఇచ్చారని, మంత్రి సత్యవతి రాథోడ్‌ రెండుసార్లు 2021, 2022లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండాకు లేఖ రాస్తే సమాధానం కూడా వచ్చిందని తెలిపారు. 

నిరసన కార్యక్రమాలకు పిలుపు 
ఇది కోట్లాది మంది గిరిజనులకు సంబంధించిన అంశమని హరీశ్‌ పేర్కొన్నారు. బీజేపీ అబద్ధాలను దేశమంతా తెలిసేలా ఎండగడతామని, పార్లమెంటులో ప్రివిలేజ్‌ మోషన్‌ ఇస్తామన్నారు. రిజర్వేషన్ల బిల్లును తొక్కిపెట్టి గిరిజనుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు ప్రతి గోండు గూడెం లో, తండాల్లో చేపట్టాలని, యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, కోరుకంటి చందర్, మాజీ ఎంపీ సీతారామ్‌ నాయక్‌పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు