రద్దుల ఘనత బీజేపీది.. పద్దుల ఘనత టీఆర్‌ఎస్‌ది: హరీశ్‌రావు 

29 Sep, 2022 03:48 IST|Sakshi
చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రభాకర్‌. చిత్రంలో కేటీఆర్, హరీశ్‌ తదితరులు

చేనేతకు కేంద్రం చెయ్యిస్తుంటే మేం చేయూతనిస్తున్నాం 

సాక్షి, హైదరాబాద్‌:  చేనేత రంగానికి, కార్మికులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన వెసులుబాటులు, వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రం చేనేత రంగాన్ని విస్మరిస్తూ అన్నీ రద్దు చేస్తుంటే.. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం పద్దులు ఇస్తూ ఆ రంగాన్ని ఆదుకుంటోందని చెప్పారు.

బుధవారం హైదరాబాద్‌ నారాయణగూడలోని వీవర్స్‌భవన్‌లో తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావుతో పాటు మంత్రి కేటీఆర్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. చేనేత రంగంపై కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టారు.  

కేంద్రానివి అన్నీ రద్దులే... 
1992లో అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆల్‌ ఇండియా హ్యాండ్‌లూమ్‌ బోర్డు, ఆల్‌ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్‌ బోర్డు, పవర్‌లూమ్‌ బోర్డులను 2020లో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని హరీశ్‌రావు తెలిపారు. దేశంలోని స్పిన్నింగ్‌ మిల్స్‌లో ఉత్పత్తి అయ్యే నూలులో 40 శాతం చేనేత రంగానికి ఇవ్వాలనే నిబంధన ఉండగా, దానిని బీజేపీ ప్రభుత్వం 15 శాతానికి కుదించిందని చెప్పారు.

ఆసరా పెన్షన్‌ కింద తాము రూ.2,016 ఇస్తుంటే దీనిలో కేంద్రానిది ఒక్క రూపాయి వాటా కూడా లేదన్నారు. మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ పెట్టుకుంటున్నామని చెప్పినా ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. రద్దులు చేసిన వారివైపు ఉండాలా? పద్దులు ఇచ్చిన వారివైపు ఉండాలా? అనేది పద్మశాలీలు ఆలోచించుకోవాలని హరీశ్‌ అన్నారు.  

ఇదేనా మేక్‌ ఇన్‌ ఇండియా? 
‘మీరు ఏ ఒక్క రంగాన్నైనా అభివృద్ధి చేశారా? ఒక్క నాడైనా చేనేత గురించి మాట్లాడారా?’అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నిలదీశారు. మేక్‌ ఇన్‌ ఇండియా అంటూ గొప్పలు చెప్పిన ప్రధాని మోదీ.. జాతీయ జెండాలను చైనా నుంచి తెప్పించారని మండిపడ్డారు. ‘ఆ జెండాల తయారీని దేశంలోని చేనేత రంగానికి ఇస్తే బాగుండేది కదా? ఇదేనా మోదీ మేక్‌ ఇన్‌ ఇండియా?’అంటూ ఎద్దేవా చేశారు.

చేనేతకు రాష్ట్రం చేయూత 
చేనేత రంగంపై, కార్మికులపై అభిమానం కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని హరీశ్‌ పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చాక నేతన్న ఎంత నేస్తే అంత బట్టని ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ నష్టాన్ని భరిస్తోందన్నారు. చేనేత మిత్ర పథకం ద్వారా 40 శాతం సబ్సిడీతో నూలును అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 40 వేల మరమగ్గాలు ఉన్నాయని, రూ.350 కోట్ల విలువైన బతుకమ్మ చీరల ఆర్డర్‌ను కార్మికులకే ఇచ్చి వారిని యజమానులను చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని చెప్పారు. నేతన్నలకు రూ.5 లక్షల బీమాను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.   

మరిన్ని వార్తలు