అధికార లాంఛనాలతో హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు

24 Sep, 2023 03:17 IST|Sakshi

పరిగి: ఉమ్మడి రాష్ట్ర ఉప సభాపతి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం పరిగిలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఆయన గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. హరీశ్వర్‌రెడ్డి భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం పట్టణంలోని ఆయన నివాసంలో ఉంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రముఖులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం పల్లవి డిగ్రీ కళాశాలలోని మైదానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన పెద్ద కుమారుడు, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి.. తండ్రి చితికి నిప్పంటించారు. 

ప్రముఖుల నివాళి 
శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితారెడ్డి, మహేందర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, రోహిత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నేత ప్రహ్లాద్‌రావు, టీడీపీ నేత కాసాని వీరేశ్‌ తదితరులు హరీశ్వర్‌రెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పించారు. కాగా హరీశ్వర్‌రెడ్డి మరణ వార్త తెలుసుకున్న హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ శనివారం ఒక ప్రకటనలో తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 

గన్‌ మిస్‌ ఫైర్‌ 
అంత్యక్రియల సందర్భంగా గాలిలో కాల్పులు చేసే క్రమంలో  ఒకరి చేతిలోని గన్‌ అకస్మాత్తుగా పేలింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు