సర్పంచ్‌ అయితే మాకేంటి ?. పెద్దసార్‌ చెబితేనే వదిలేస్తాం..

29 May, 2021 14:20 IST|Sakshi
బైక్‌ ఆపి ఎస్సైతో మాట్లాడుతున్న సర్పంచ్‌ శరత్‌

ఆస్పత్రికి వెళ్లొస్తున్న దంపతులపై  ట్రెయినీ ఎస్సై దురుసుతనం

సాక్షి, హసన్‌పర్తి : నువ్వు సర్పంచ్‌ అయితే నాకేంటి! లాక్‌డౌన్‌ ఉందని తెలియదా... ఏమైనా ఉంటే పెద్ద సార్‌కు చెప్పుకో... అంటూ ఓ ట్రెయినీ ఎస్సై వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. హసన్‌పర్తి మండలం సీతంపేట సర్పంచ్‌ జనగాని శరత్‌ దంపతులు ఇటీవల కరోనా బారిన పడ్డారు. పదిహేను రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు మళ్లీ పరీక్ష చేయించుకునేందుకు శుక్రవారం ఉదయం హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో తిరుగుపయనమయ్యారు. అయితే, వారు హసన్‌పర్తి బస్టాండ్‌ వద్దకు చేరుకునే సరికి సమయం 10.20 గంటల అవుతుండడంతో  పోలీసులు తనిఖీలు మొదలయ్యాయి. దీంతో శరత్‌ దంపతుల వాహనాన్ని ట్రెయినీ ఎస్సై ఆపారు.

దీంతో ఆయన “సార్‌ నేను సీతంపేట సర్పంచ్‌ను. నాతో పాటు నా భార్యకు పక్షం రోజుల క్రితం కరోనా వచ్చింది. ఆస్పత్రికి  వెళ్లివస్తున్నాం’ అని చెప్పినా వినకుండా బైక్‌ పక్కన పెట్టి మాట్లాడాలంటూ ఎస్సై నుంచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత నచ్చచెప్పినా వినకపోగా రోడ్డు ఆవతలి వైపున ఉన్న పెద్ద సార్‌కు చెప్పుకుని, ఆయన అనుమతి ఇస్తేనే  వదిలి పెడతానని స్పష్టం చేశాడు. దీంతో కాసేపు వేచి ఉన్న సర్పంచ్‌ శరత్‌ తనకు తెలిసిన ఎస్సైకు ఫోన్‌ చేయగా, ఆయన జోక్యం చేసుకోవడంతో సర్పంచ్‌ను పంపించారు. లాక్‌డౌన్‌ అమలుకు పోలీసులు నిరంతరం శ్రమిస్తుండగా, ఒకరిద్దరు వ్యవహరిస్తున్న తీరుతో శాఖకు అప్రతిష్ట వస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు నిబంధనల అమలు విషయంలో సిబ్బందికి తగిన సూచనలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

చదవండి: అంబులెన్స్‌ ధరలు.. మోటారుసైకిల్‌పై మృతదేహం తరలింపు
ధోవతి ఫంక్షన్‌ తెచ్చిన తంటా..∙ 10 మందికి సోకిన కరోనా

మరిన్ని వార్తలు