ఎంత చిన్న వయసులో స్మార్ట్‌ఫోన్లు ఇస్తే.. అన్ని సమస్యలు.. ప్రాణాలు తీసుకునే ఆలోచనలు

18 May, 2023 03:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పిల్లలకు డిజిటల్‌ పరిజ్ఞానం పెరుగుతుందని, ఆన్‌లైన్‌లో నేర్చుకుంటారని స్మార్ట్‌ఫోన్లుగానీ, ట్యాబ్లెట్‌గానీ ఇస్తే.. భవిష్యత్తులో మానసిక సమస్యల బారినపడటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత చిన్న వయసులో పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ ఇస్తే.. పెద్దయ్యాక మానసిక ఇబ్బందులతో బాధపడే అవకాశాలు అంత ఎక్కువగా  ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. 

అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ సేపియన్‌ ల్యాబ్స్‌ ఇటీవల భారత్‌ సహా  40 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బాల్యంలోనే స్మార్ట్‌ఫోన్లను అందుకున్నవారు.. యుక్త వయసుకు వచ్చాక ఆత్మహత్య ఆలోచనలు పెరగడం, ఇతరుల పట్ల దూకుడుగా వ్యవహరించడం, వాస్తవికత నుంచి దూరంగా పలు రకాల భ్రాంతులకు గురికావడం వంటివి ఎదుర్కొంటున్నట్టు తేలింది.

ఈ అధ్యయనం కోసం పలు దేశాల్లో 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న 27,969 మంది నుంచి డేటా సేకరించారు. అందులో మన దేశానికి చెందినవారు  4,000 మంది ఉండటం గమనార్హం.

అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ..
♦ మహిళలకు సంబంధించి.. పెద్దగా ఊహ తెలియని అంటే ఆరేళ్ల వయసులోనే స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించడం ప్రారంభించిన 74% మంది తీవ్రమైన మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇక 10 ఏళ్ల వయసులో మొదటి స్మార్ట్‌ఫోన్‌ అందుకున్నవారిలో 61% మంది.. 15 ఏళ్లకే వాడటం మొదలుపెట్టినవారిలో 52% మంది.. 18 ఏళ్లకు వాడటం ప్రారంభించిన వారిలో 46% మంది మానసిక దుష్ప్రభావాలకు లోనయ్యారు.

♦ పురుషులకు సంబంధించి ఈ ప్రభావం కాస్త తక్కువగా ఉన్నట్టు తేలింది. ఆరేళ్ల వయసులో స్మార్ట్‌ఫోన్‌ను వాడటం మొదలుపెట్టిన వారిలో 42% 
మంది మానసిక సమస్యలకు గురైతే.. 18 ఏళ్లలో స్మార్ట్‌ఫోన్‌ చేతపట్టిన వారిలో ఇది 36 శాతమే.

♦ పిల్లలకు చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్‌/ట్యాబ్లెట్‌  చేతికి ఇచ్చి మురిసిపోతున్న  తల్లిదండ్రులు.. వారు భవిష్యత్తులో మానసిక సమస్యల బారిన  పడేందుకు కారణమవు తున్నారని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఎంత చిన్న వయసులో స్మార్ట్‌ఫోన్‌/ట్యాబ్లెట్‌ ఇస్తే.. వారు యుక్త వయసులోకి వచ్చాక  అంత ఎక్కువగా మానసిక సమస్యల బారినపడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. చిన్నవయసులో స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వడమంటే చేజేతులా వారి భవిష్యత్తును నాశనం చేసినట్టేనని పేర్కొంది.

అంతర్జాతీయ సగటు కంటే మనమే ఎక్కువ..
గత ఏడాది విడుదలైన మెకాఫె గ్లోబల్‌ కనెక్టెడ్‌ ఫ్యామిలీ సర్వే ప్రకారం.. 10–14 ఏళ్ల వయసున్న భారతీయుల్లో స్మార్ట్‌ఫోన్‌ వినియో గం 83% ఉండటం గమనార్హం. అంతర్జాతీయ సగటు 76% కంటే ఇది 7% ఎక్కువ. అంటే మన దగ్గర మిగతా అన్ని వయసుల వారికన్నా.. పిల్లలు ఎక్కువగా స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నారు. వారు సగటున రోజుకు 5–8 గంటల పాటు.. అంటే సంవత్సరానికి 2,950 గంటల వరకు ఆన్‌లైన్‌లోనే గడుపుతు న్నారని వినియోగ గణాంకాలు చూపిస్తున్నాయి.

తోటి వారితో కలవక ప్రవర్తన దెబ్బతింటోంది
స్మార్ట్‌ఫోన్‌ విప్లవానికి ముందు పిల్లలు చాలా సమయం కుటుంబంతో, స్నేహితులతో గడిపేవారు. ఇప్పుడీ పరిస్థితి లేదు. సమాజంలో తమ భాగస్వామ్యానికి తగినట్టుగా సాధన లేక పోవడం, తోటివారితో కలవకపోవడంతో ప్రవర్తన తీరు సంక్లిష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌కు చిరు ప్రాయంలోనే అలవాటు పడటం అంటే పెద్దవారిగా ఎక్కువ మానసిక సమస్యలు ఎదుర్కోవడానికి దారితీసుకోవడమే.

ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు, ఇతరుల పట్ల దూకుడు భావాలు, వాస్తవికతకు దూరమైన ఆలోచనలు, సమాజం నుంచి వేరుగా ఉన్నామన్న భావన వంటివి చుట్టు ముట్టే అవకాశాలు ఎక్కువ. యుక్త వయసు వచ్చాకే పూర్తి స్థాయిలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగానికి అవకాశం ఇవ్వడం మంచిది.
– సేపియన్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకులు, న్యూరో సైంటిస్ట్‌ తారా త్యాగరాజన్‌ 

మరిన్ని వార్తలు