కాలేజీలు మూసి.. స్కూళ్లు తెరుస్తారా?: తెలంగాణ హైకోర్టు

29 Jan, 2022 02:13 IST|Sakshi

పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వ వైఖరి చెప్పాలన్న హైకోర్టు

‘సమ్మక్క సారలమ్మ’ జాతరలో కరోనా నియంత్రణ చర్యలేంటి ? 

వారాంతపు సంతల్లో ఏం చర్యలు తీసుకుంటున్నారు ? 

సాక్షి, హైదరాబాద్‌: ఒకపక్క యూనివర్సిటీలు, కాలేజీలు మూసేస్తూ మరోవైపు ఈనెల 30 తర్వాత పాఠశాలలు తెరుస్తామని పేర్కొనడం ఏంటని హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వ అభిప్రాయం ఏంటో తెలిజేయాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలిలతో కూడిన ధర్మాసనం కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను శుక్రవారం మరోసారి విచారించింది. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది హాజరయ్యే నేపథ్యంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే జంటనగరాల్లో జరుగుతున్న వారాంతపు సంతల్లో ప్రజలు గుమిగూడకుండా, భౌతిక దూరం పాటించేలా ఎటువం టి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని అడిగింది.  

3.45 లక్షల కిట్లు పంపిణీ 
రాష్ట్ర వ్యాప్తంగా 77.33 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే నిర్వహించి స్వల్ప లక్షణాలున్నవారికి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్‌లో ధర్మాసనానికి తెలిపారు. చిన్న పిల్లల వైద్యానికి సంబంధించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌పడకల సంఖ్య బాగా పెంచామని వివరించారు. లక్షణాలున్న వారికి పంపిణీ చేస్తున్న మందుల కిట్లలో చిన్న పిల్లలకు అవసరమైన మందులు లేవని, వారికి ప్రత్యేకంగా కిట్లు ఇచ్చేలా ఆదేశించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కౌటూరి పవన్‌కుమార్‌ నివేదించారు. చిన్నారుల వైద్యానికి ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని మరో పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది రవిచందర్‌ నివేదించారు. వారాంతపు సంతల్లో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారని, వీరి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉందని మరో పిటిషనర్‌ తరఫు న్యాయవాది మయూర్‌రెడ్డి పేర్కొన్నారు.  

జాతరలో కోటిమంది పాల్గొనే అవకాశం 
గోదావరి నది తీరంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో ఐదు రాష్ట్రాల నుంచి 75 లక్షల నుంచి కోటి మంది పాల్గొనే అవకాశం ఉందని, కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున కరోనా వ్యాపించే అవకాశముందని మరో పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ నివేదించారు. కుంభమేళా సందర్భంగా పెద్ద ఎత్తున కరోనా వ్యాపించడాన్ని ఆయన గుర్తు చేశారు.  

చిరు వ్యాపారులను రోడ్డు మీద పడేయలేం 
వారాంతపు సంతలకు వెళ్లే వారి ద్వారా పెద్ద ఎత్తున కరోనా వ్యాపించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో వాటిని నిర్వహించకుండా ఆదేశించాలన్న వాదనను ధర్మాసనం సున్ని తంగా తిరస్కరించింది. ‘రోడ్ల మీద కూరగాయలు అమ్ముకొని, చిరు వ్యాపారాలు చేసుకొనేవారు వారి కొచ్చే రూ.100తో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారాంతపు సంతలను మూసేసి వాళ్ల నోటి దగ్గర ముద్ద లాక్కోమంటారా? ఉపాధి లేకుం డా చేసి రోడ్ల మీద పడేయాలా? ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూనే ఉంది..’ అని ధర్మాసనం పేర్కొంది. మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని తెలిపింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని డాక్టర్‌ శ్రీనివాసరావును ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు