గ్రూప్‌-1 రద్దు: పదేపదే విఫలమవుతున్నారు.. TSPSCపై హైకోర్టు సీరియస్‌

26 Sep, 2023 16:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దుపై తెలంగాణ హైకోర్టు నేడు(మంగళవారం) విచారణ చేపట్టింది.  గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ టీఎస్‌పీఎస్సీ కమిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు మీరే ఉల్లంఘిస్తే ఎలా అంటూ మండిపడింది. ఒకసారి పేపర్‌ లీక్‌, ఇప్పుడేమో బయోమెట్రిక్‌ సమస్య పేరుతో విద్యార్థుల జీవితాలో ఆడుకుంటున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గ్రూప్‌-1 పరీక్షలో బయోమెట్రిక్‌ ఎందుకు పెట్టలేదని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ విఫలం అయ్యిందని, రెండోసారి కూడా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.   గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

కాగా జూన్‌లో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను టీఎస్‌పీఎస్సీ ఆశ్రయించింది. 

వాస్తవానికి 11 ఏళ్ల తర్వాత గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్‌ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత మళ్లీ ఈ ఏడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా.. ఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ఇటీవల హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రెండుసార్లు రద్దవడంతో ఇటు అభ్యర్థులతోపాటు కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది.
చదవండి: ట్యాంక్‌ బండ్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

మరిన్ని వార్తలు