పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

6 Nov, 2022 04:24 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 

సదస్సులో సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 

ఇతర రాష్ట్రాలకు తెలంగాణ మార్గదర్శకం: సీఎస్‌ 

పాల్గొన్న డీజీపీ, న్యాయమూర్తులు 

సాక్షి, హైదరాబాద్‌:  పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, దీని కోసం ప్రభుత్వంలోని వివిధ శాఖలు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ పేర్కొన్నారు. తెలంగాణ జ్యుడీషియల్‌ అకాడమీ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై సంబంధిత శాఖలు, న్యాయా­దికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం సీజే మాట్లాడుతూ.. పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేస్తేనే మహిళలు, పిల్లలకు భద్రత ఏర్పడుతుందని స్పష్టం చేశారు.

పోక్సో చట్టం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలీస్‌ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల నేతృత్వంలో ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను సీఎస్‌ ఈ సందర్భంగా వివరించారు. మహిళలు, పిల్లల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, దీనిలో భాగంగానే రాష్ట్ర పోలీస్‌ విభాగంలో ప్రత్యేకంగా అడిషనల్‌ డీజీ నేతృత్వంలో మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు.

ఈ సదస్సుకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డా. షమీమ్‌ అక్తర్, జస్టిస్‌ వినోద్‌కుమార్, జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డి, జస్టిస్‌ రాధారాణి, జస్టిస్‌ నందా, అడిషనల్‌ డీజీ స్వాతిలక్రా, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి దివ్య, న్యాయశాఖ కార్యదర్శి నర్సింగ్‌ రావు, జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ తిరుమలాదేవి, సుజన ఇతర అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు