హెచ్‌సీయూ @2

14 Sep, 2020 04:26 IST|Sakshi

దేశంలోని టాప్‌–25 కేంద్రీయ వర్సిటీల్లో రెండో స్థానం 

1,000కి 887.78 స్కోర్‌ సాధన 

అగ్రస్థానంలో ఢిల్లీ జేఎన్‌యూ 

24వ ర్యాంకులో ‘మనూ’ 

‘ఔట్‌లుక్‌’–2020 ర్యాంకింగ్స్‌ ప్రకటన

రాయదుర్గం(హైదరాబాద్‌): నగరంలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఘనతల్లో మరొకటి చేరింది. ఔట్‌లుక్‌–ఐసీఏఆర్‌ఈ ఇండియా యూని వర్సిటీ ర్యాంకింగ్స్‌–2020లో రెండో స్థానం పొం దింది. ర్యాంకుల జాబితాను ఆదివారం ప్రకటిం చారు. ప్రథమ స్థానంలో ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నిలిచింది. మొత్తం 1,000కి గాను జేఎన్‌యూ 931.67 స్కోర్‌ పొందింది. 887.78 స్కోర్‌తో హెచ్‌సీయూ ద్వితీయస్థానం సాధించింది. దేశంలోని అత్యుత్తమ టాప్‌–25 వర్సిటీలతో ఈ జాబితా వెలువడింది. ఇందులో రాష్ట్రం నుంచి హెచ్‌సీయూతోపాటు మరో వర్సిటీ ‘మనూ’చోటు దక్కించుకోవడం విశేషం. ‘మనూ’24వ ర్యాంకులో నిలిచింది. ప్రధానం గా అకడమిక్, రీసెర్చ్‌ ఎక్స్‌లెన్స్, ఇండస్ట్రీ ఇంటర్ఫే స్, ప్లేస్‌మెంట్, వసతులు, గవర్నెన్స్, అడ్మిషన్లు, డైవర్సిటీ, ఔట్‌రీచ్‌ వంటి పరిమితులలో సాధించిన ప్రగతి ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.  

‘మనూ’కు 24వ స్థానం
ఔట్‌లుక్‌–ఐసీఏఆర్‌ఈ ఇండియా ర్యాంకింగ్స్‌– 2020లో రాష్ట్రం నుంచి చోటు దక్కించుకున్న మరో వర్సిటీ మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ). జాబితాలో ‘మనూ’ 24వ స్థానం పొందింది. మొత్తం 1,000 స్కోరుకు గాను 436.88 సాధించింది.  

ప్రపంచస్థాయి గుర్తింపే లక్ష్యం.. 
దేశంలోని 25 ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూ రెండో స్థానం పొందడం గర్వంగా ఉంది. ఇది సమష్టి కృషికి నిదర్శనం. వర్సిటీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తాం. దీనికోసం వ్యవస్థీకృత ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా గుర్తింపు పొందడంతోనే మరింత ఉన్నత స్థానానికి ఎదగడానికి దోహదం చేస్తోంది. విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు కలసి కృషి చేస్తే సాధించలేనిది లేదు. 
–ప్రొఫెసర్‌ పొదిలె అప్పారావు, 
హెచ్‌సీయూ ఉపకులపతి.   

మరిన్ని వార్తలు