ఆరోగ్యం-ఆదాయం: ఒక్కసారి నాటితే 15 ఏళ్లవరకు దిగుబడి.. కిలో రూ.50 నుంచి 100

2 Mar, 2022 19:55 IST|Sakshi
మేళ్లదుప్పలపల్లి వద్ద అంజీర తోట

నాటిన ఆరు నెలల నుంచి 15 ఏళ్ల వరకు దిగుబడి

మేళ్లదుప్పలపల్లిలో మూడెకరాల్లో సాగు

తోట వద్దకే వచ్చి పండ్లు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు

నల్లగొండ రూరల్‌: సంపూర్ణ ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేసే ఫలాల్లో అంజీర ముందువరుసలో ఉంటుంది. ఈ పండ్ల తోటలు ఎక్కువగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట మనకు కనిపిస్తాయి. నల్లగొండ మండలంలోని మెళ్లదుప్పలపల్లిలో మూడు ఎకరాల్లో రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు యాదయ్య నాలుగేళ్ల క్రితం పూణె రకం అంజీర సాగు చేపట్టాడు. ఒక్కసారి నాటిన తర్వాత ఆరు నెలల నుంచి 15 ఏళ్ల వరకు దిగుబడి లభిస్తుంది. అంజీర పండ్లను వ్యాపారులు తోట వద్దకే వచ్చి కిలో రూ.50 నుంచి రూ.100 చెల్లించి కొనుగోలు చేసేవారు. పండ్లు కావాల్సిన వారు అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించేవారు. యాదయ్య తోటలో మరో 15 రోజుల్లో దిగుబడి రానుంది.

సేంద్రియ పద్ధతిలో సాగు
అంజీర సాగు చేయాలని భావించిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు పంతంగి యాదయ్య వివిధ ప్రాంతాల్లో ఈ తోటలను పరిశీలించారు. సాగు పద్ధతులు, మార్కెట్‌ గురించి తెలుసుకున్నాడు.  పూణె లోకల్‌ వెరైటీ అంటు మొక్కలను కర్నాటకలోని బళ్లారి నుంచి చెప్పించాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేపట్టాడు. ఎక్కువ దిగుబడి కోసం చిగుళ్లను తుంచడం ద్వారా కాండానికి ఇరువైపులా పిలకలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. ఈ తోటకు పెద్దగా నీటి తడులు అవసరం లేదు. రెండు రోజులకోసారి డ్రిప్‌ద్వారా తడి అందిస్తున్నారు. ఈ తోటలకు పెద్దగా సస్యరక్షణ చర్యలు అవసరం ఉండవు కానీ పిట్టలు, కోతులు ప్రభావం ఉంటుంది. అయితే ఉద్యానశాఖ నుంచి ఎలాంటి సబ్సిడీలు లేకపోవడంతో తోటల సాగువైపు రైతులు పెద్దగా దృష్టి పెట్టడం లేదు.

అంజీరతో ప్రయోజనాలు ఎన్నో..
అంజీర పండులో ఫైబర్‌ సమృద్ధిగా లభిస్తుంది. జీర్ణ ప్రక్రియను మెరుగు పర్చుతుంది. ఎసిడిటీ, మలబద్ధకాన్ని నిరోధించి రక్తంలో హిమోగ్లోబిన్‌  పెంచుతుంది. పొటాషియం, సోడియం లభిస్తుంది. అధిక బరువును తగ్గించి చెడు కొలస్ట్రాల్‌ను నిరోధిస్తుంది. మెగ్నిషియం, మాంగనీస్‌ ఉంటుంది. గుండె సమస్యను నివారించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఆసక్తి చూపుతున్నారు
పురుగు మందు అవశేశాలు లేని పండ్లు, కూరగాయలు తినేందుకు ప్రజలంతా ఆసక్తి చూపుతున్నారు. తోటలో రెండో దశ దిగుబడి వస్తుంది. చెట్టు ఏపుగా పెరగడంతో కొమ్మలు తొలగిస్తే మళ్లీ దిగుబడి వస్తుంది. 
– యాదగిరిగౌడ్, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు 

మరిన్ని వార్తలు