‘విరించి’పై వేటు!

5 Aug, 2020 08:18 IST|Sakshi

కోవిడ్‌ చికిత్సల అనుమతి రద్దు 

‘సాక్షి’ వరుస కథనాలకు స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ 

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ చికిత్సల పేరుతో రోగులను నిలువు దోపిడీ చేస్తున్న మరో కార్పొరేట్‌ ఆస్పత్రిపై ప్రభుత్వం వేటు వేసింది... సదరు ఆసుపత్రికి ఇచ్చిన కోవిడ్‌ చికిత్సల అనుమతిని రద్దు చేసింది. ఇప్పటికే ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్న రోగులకు యథావిధిగా చికిత్సలందించాలని స్పష్టం చేసింది. ఇకపై కొత్త కేసులను తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. వివరాలు... బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–1లో ఉన్న విరించి ఆస్పత్రి కోవిడ్‌ చికిత్సల పేరుతో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అబిడ్స్‌కు చెందిన 81 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగి జూలై 22న విరించి ఆస్పత్రిలో చేరగా.. 31న మృతి చెందారు. కేవలం 8 రోజులకు రూ. 8 లక్షలకుపైగా బిల్లు వేశారు. ఇందులో 246 పీపీఈ కిట్లు వాడినట్లు చూపించి రూ.2,23,560 బిల్లు వేయడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు.

ఇదే అంశంపై ‘పీపీఈ కిట్లు...రూ.2,23,560’ శీర్షికతో ఆగస్టు 1న ‘సాక్షి’ సిటీ ఎడిషన్‌లో ప్రత్యేక కథనం ప్రచురించింది. అదే విధంగా కోవిడ్‌ వ్యర్థాల నిర్వహణ, తరలింపు విషయంలోనూ ఆస్పత్రి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇటు జలమండలి సహా ట్రాఫిక్‌ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఇదే అంశంపై ‘జనావాసాల మధ్య నుంచే కోవిడ్‌ వ్యర్థాలు... బరితెగింపు’ శీర్షికన ‘సాక్షి’ సిటీ ఎడషన్‌లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. వీటితో పాటు కోవిడ్‌ చికిత్సల పేరుతో చంపాపేటకు చెందిన ఓ యువ న్యాయవాది నుంచి రూ.16 లక్షలకుపైగా బిల్లు వసూలు చేశారని వైద్య ఆరోగ్యశాఖ వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు అందింది. వరుస కథనాలకు తోడు బాధితుల ఫిర్యాదులకు స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ   విచారణ చేపట్టింది. ఆస్పత్రిలో కోవిడ్‌ చికిత్సలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల క్రితం సోమాజిగూడలోని డెక్కన్‌ ఆస్పత్రిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా విరించిపై వేటు వేయడం కొసమెరుపు.

>
మరిన్ని వార్తలు