కు.ని. ఆపరేషన్లపై పారదర్శకంగా విచారిస్తాం

3 Sep, 2022 01:41 IST|Sakshi
వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న శ్రీనివాసరావు 

ప్రజారోగ్యశాఖ సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు

ఇబ్రహీంపట్నం: కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోయిన ఘటనలో ప్రభుత్వానికి 2 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని నిపుణుల కమిటీ విచారణాధికారి, ప్రజారోగ్యశాఖ సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన శుక్రవారం  ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిని ఆయన సందర్శించారు.  అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కు.ని. ఆపరేషన్లు చేయించుకున్నవారిలో నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు.

ఈ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ నుంచి ఈ ఆస్పత్రిలో 5 క్యాంపులు నిర్వహించగా గత నెల 25న జరిగిన ఆపరేషన్లు వికటించాయన్నారు. ఇక్కడ ఆపరేషన్లు చేసిన వైద్యులు ఆ మరుసటి రోజు చేవెళ్లలో 60 మందికి, సూర్యాపేటలో 100 మందికి శస్త్రచికిత్సలు చేశారని చెప్పారు.

ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలే దన్నారు. ఆరోజు ఆపరేషన్లు చేసుకున్న మరో 30 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడ గా ఉందన్నారు. నిమ్స్‌ నుంచి ఐదుగురిని, అపోలో నుంచి ఆరుగురిని శుక్రవారం డిశ్చార్జి చేశామన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిని విచారిస్తున్నామని.. పోస్టు మార్టం, ఫోరెన్సిక్‌ నివేదికలు వస్తే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందన్నారు.  

మరిన్ని వార్తలు