కమ్యూనిటీలోకి కరోనా వైరస్‌..

24 Jul, 2020 00:57 IST|Sakshi

ఎన్నిరోజులకు పోతుందో తెలియదు

వచ్చే నాలుగైదు వారాలు క్లిష్ట పరిస్థితి

మునుముందు మరిన్ని కేసులు 

మాస్క్, భౌతికదూరం, చేతుల శుభ్రత ముఖ్యం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన చర్యలు.. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ కేసుల తీవ్రత

భయాందోళన వద్దు.. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడికి చూపించుకోండి

మాయదారి మహమ్మారి జన సమూహంలోకి చొచ్చుకొచ్చేసిందా?.. కరోనా వైరస్‌ ఇకపై ఎవరికి, ఎక్కడ, ఎలా సోకిందో గుర్తించడం కష్టమేనా?.. వచ్చే నాలుగైదు వారాలు గడ్డు కాలమేనా?.. కరోనా వైరస్‌ ఇక స్వైరవిహారం చేయనుందా?.. గురువారం వైద్యశాఖ ఉన్నతాధికారులు చెప్పిన వివరాలను బట్టి చూస్తే  రాష్ట్రంలో వైరస్‌ తీవ్ర రూపం దాల్చినట్టే కనిపిస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌ : ‘కరోనా వైరస్‌ కమ్యూనిటీలోకి వెళ్లింది. ఎక్కడుందో, ఎలా సోకుతుందో పసిగట్టడం కష్టం. కంటికి కనిపించని ఈ వైరస్‌ పట్ల జాగ్రత్తలు పాటించడం తప్ప మరో మార్గం లేదు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరంలాంటి అనారోగ్య సమస్యలు వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోండి. తక్షణమే గుర్తించడం, వెంటనే చికిత్స పొందడం ద్వారానే కరోనా నుంచి బయట పడగలం. తీవ్రత పెరిగితే ఆ తరువాత ఏం చేసినా ఫలితం ఉండదు’ అని వైద్యశాఖ సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, వైద్య శాఖ చేపట్టిన చర్యలపై గురువారం కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే రోజుల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా మరణాలు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని, ఇందులోనూ దీర్ఘకాలిక సమస్యలతో చనిపోయే వారే అధికంగా ఉన్నా రన్నారు. కరోనా వైరస్‌కు భయపడవద్దని, జాగ్రత్తలు పాటించి సహజీవనం చేయడమొక్కటే మన ముందున్న మార్గమన్నారు. ఈ వైరస్‌ ప్రభావం ఎన్నిరోజులుంటుందో ప్రస్తుతం చెప్పడం కష్టమన్నారు. రాష్ట్రంలో ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలను పెంచుతున్నామని, ఇటీవల రెండు లక్షల కిట్లు తెప్పించగా వాటితో పరీక్షలు చేశామని, మరో రెండు లక్షల కిట్లు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

ఆ 3 సూత్రాలే శ్రీరామ రక్ష
వచ్చే నాలుగైదు వారాలు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోబోతున్నామని డాక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మూడు సూత్రాలను పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడం, ఆరడుగుల భౌతికదూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం.. ఇవి తప్పక ఆచరించాలన్నారు. హైదరాబాద్‌లో కేసుల తీవ్రత అధికంగా ఉందని, దీంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని, కొత్త జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనా చికిత్సను మరింత విస్తృతం చేశామన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షలు చేస్తున్నామన్నారు.

ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే అప్పుల పాలే..
బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొద్దని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటే అప్పుల పాలవుతారని డాక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు చార్జ్‌ చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రస్తుతం కరోనాకు ప్రత్యేక చికిత్స లేదని, లక్షణాలను బట్టి మందులు వేసుకోవాలని, ఇది చాలా సింపుల్‌ పద్ధతి అని అన్నారు. చిన్న లక్షణం కనిపించినా డాక్టర్‌ వద్దకు వెళ్లాలని, నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పుగా మారుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8 వేలకు పైగా ఐసోలేషన్, ఆక్సిజన్, వెంటిలేటర్‌ బెడ్లు ఉన్నాయని, ప్రైవేటు ఆస్పత్రుల్లో 4,200 పడకలు ఉన్నాయని, మొత్తంగా 15 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. లక్షణాలు ఉన్న వారంతా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, ఈ మేరకు అన్ని పీహెచ్‌సీల్లో కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రోజూ సగటున 15 వేల పరీక్షలు చేస్తున్నామని, త్వరలో వీటిని 20–25 వేలకు పెంచుతామన్నారు.

కరోనా బారిన వెయ్యి మంది వైద్య సిబ్బంది
కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న దాదాపు వెయ్యికి పైగా వైద్య సిబ్బంది వైరస్‌ బారినపడ్డారని డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. కోర్టుల్లో గడియకో పిల్‌ వేస్తే ఎలా పనిచేస్తామని, ఇది మంచి పరిణామం కాదన్నారు. వైద్య సిబ్బందికి అన్ని వర్గాలు మద్దతు పలకాలని, కరోనా బాధితులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేదని, స్థానికంగానే చికిత్స చేయించుకోవాలని ఆయన సూచించారు. బాధితుల్ని అవసరమైతే 108 అంబులెన్స్‌ల్లో నగరంలోని ఆస్పత్రులకు తరలించే బాధ్యత వైద్యాధికారులదేనని ఆయన చెప్పారు.

ఇటు ‘సీజనల్‌’ దాడి.. అటు కరోనా పంజా
కరోనా వైరస్‌తో కొత్త చిక్కొచ్చిపడింది. అసలే వర్షాకాలం.. జలుబు, వైరల్‌ జ్వరాలు పంజా విసిరే సమయం. ప్రస్తుతం ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దోమలు విజృంభిస్తున్నాయి. సీజనల్‌గా వచ్చే టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాలకు స్వైన్‌ఫ్లూ కూడా తోడైంది. సీజనల్‌ వ్యాధులకు..కరోనా వైరస్‌కు కామన్‌ సింప్టమ్‌ జ్వరమే. దీంతో ఎవరు ఏ జ్వరంతో బాధపడుతున్నారో గుర్తించడం కష్టం కానుంది. ఇప్పటికే గాంధీ సహా తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (టిమ్స్‌) ఆస్పత్రులను ప్రభుత్వం పూర్తిస్థాయి కోవిడ్‌ సెంటర్లుగా మార్చింది.

మున్ముందు కేసులు భారీగా పెరుగుతాయనే వైద్య ఆరోగ్యశాఖ అంచనాలతో ఇప్పటి వరకు టెస్టింగ్, ఐసోలేషన్‌ సెంటర్లుగా ఉన్న కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి, నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రులను కూడా పూర్తి స్థాయి కోవిడ్‌ కేంద్రాలుగా మార్చుతున్నట్టు ప్రకటించడంతో ఆయా ఆస్పత్రుల్లో సాధారణ రోగులకు చికిత్సలు ప్రశ్నార్థకంగా మారాయి. మరోపక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లో పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయి. ఇక్కడ మార్చి 2న తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 1,616 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు తర్వాత వీటి సంఖ్య అనుహ్యంగా పెరిగింది.

దీంతో జూన్‌లో 11,080 కేసులు, జూలైలోని 22 రోజుల్లోనే 21,443 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నగరంలో రోజుకు సగటున 800–1,000 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో 80 శాతం మందిలో లక్షణాలు కన్పించట్లేదని అంచనా. దీంతో తమకు తెలియకుండానే వీరు వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను నిలిపివేసింది. ఆస్పత్రుల్లోని పడకల నిష్పత్తికి మించి బాధితులు వస్తుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. 

తక్షణ నిర్ధారణతోనే మరణాలకు చెక్‌ 


కరోనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైరస్‌ నిర్ధారణ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. తక్షణ నిర్ధారణతోనే మరణాలకు చెక్‌ పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. వైద్య విధాన పరిషత్‌ ద్వారా నిర్వహిస్తున్న ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆస్పత్రుల్లో డైట్‌ కాంట్రాక్టర్లకు బకాయిలన్నీ చెల్లించాలని, ఈ మేరకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ సెంటర్లు మొదలు పెట్టాలని, శానిటేషన్, పేషెంట్‌ కేర్‌ ప్రొవైడర్స్, ల్యాబ్‌ టెక్నీషియన్స్, నర్సింగ్‌ స్టాఫ్‌లో అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. అన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్లను రాష్ట్ర కార్యాలయ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు