TS: హెల్త్‌ ప్రొఫైల్‌కు బ్రేక్‌.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదన

26 Nov, 2022 08:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హెల్త్‌ ప్రొఫైల్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించి సర్కారుకు ప్రతిపాదన చేసింది. ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌కు శ్రీకారం చుట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. వైద్యపరీక్షలు నిర్వహించగా అత్యధికులకు అనారోగ్య సమస్యలు కనిపించాయి.

మరోవైపు తమకు ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయా అన్న భయాందోళన బాధితుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమాన్ని సర్కారు తాత్కాలికంగా వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి వ్యాధులున్న వారందరికీ పరీక్షలు నిర్వహించడం, డాక్టర్‌ కన్సల్టేషన్‌ కల్పించడం సవాల్‌తో కూడిన వ్యవహారమే కాకుండా, అందుకు అవసరమైన మందులు సమకూర్చడం కూడా కష్టమనే భావన అధికారుల్లో నెలకొంది. ఫలానా జబ్బు ఉందని తెలియగానే రోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు.

కరోనా కాలంలో భయం కారణంగా అనేకమంది ఆసుపత్రుల పాలైనట్లుగా, ఇప్పు డు వైద్యపరీక్షలు చేస్తే అవసరమున్నా లేకున్నా, బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీసే పరిస్థితి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఆ రెండు జిల్లాల హెల్త్‌ ప్రొఫైల్‌లో వెలుగు చూసిన అంశాలు, తదుపరి నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు. 

వచ్చే హెల్త్‌ ప్రొఫైల్‌లో పరీక్షల సంఖ్య కుదింపు 
18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు వివిధ రకాల టెస్టులు చేయడం ద్వారా ముందస్తుగా ఏమైనా వ్యాధులుంటే వాటికి వైద్యం అందించాలన్నదే సర్కారు ఉద్దేశం. ఆ వివరాలతో ప్రతి ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందనుంది. సిరిసిల్ల, ములుగు కాకుండా మిగిలిన 31 జిల్లాల్లోనూ ఇప్పటికే హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రారంభించాల్సి ఉండగా, తాత్కాలికంగా వాయిదా వేశారు. జనవరి 18 నుంచి ఐదు నెలలపాటు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాధారణ ఎన్నికల సమయం సమీపించే అవకాశముంది. సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌లో భాగంగా 30 టెస్టులు చేశారు. కానీ, రానున్న హెల్త్‌ప్రొఫైల్‌ కార్యక్రమంలో పరీక్షల సంఖ్యను కుదించాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది.

ఏదో ఒక అనారోగ్యం..
ములుగు జిల్లాలో 1,81,540 మందికి స్క్రీనింగ్‌ చేయగా 1,10,527 మందికి ఏదో ఒకరకమైన అనారోగ్యం ఉన్నట్లు తేలింది. 11,896 మందికి థైరాయిడ్, 28,281 మందికి లివర్‌ సమస్యలు, 28,857 మందికి కాల్షియంలోపం, సీబీపీ(కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌)లో 23,216 మందికి అసాధారణ అనారోగ్య సమస్యలు, లిపిడ్‌ ప్రొఫైల్‌లో 65,586 మందికి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువమందికి రక్తహీనత ఉంది. 12,186 మందికి కిడ్నీ సమస్యలు, అమైలేస్‌ ఎంజైమ్‌ లోపంతో 11,752 మంది, మరో 10,124 మందికి యూరిక్‌ యాసిడ్, 9,775 మందిలో నియంత్రణలో లేని డయాబెటీస్‌ ఉన్నట్లు తేలింది.
చదవండి: Group 4 Notification: శాఖల వారీగా గ్రూప్‌–4 పోస్టుల వివరాలివే..

మరిన్ని వార్తలు