శరీరం పైభాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తుందా..!

2 Nov, 2021 14:40 IST|Sakshi

ప్రాథమిక వైద్యంపై రోగులకు లేని అవగాహన రాహిత్యం

నిత్యం ఎలక్‌ట్రానిక్‌ పరికరాల వినియోగంతో ఒత్తిడికి గురువుతున్న వైనం

స్ట్రోక్‌ వచ్చిన గంటలోపు చికిత్స అందించిన వారిలో మరణాలు తక్కువ

గుండె వైద్య నిపుణుడు డా. శ్రీనివాస రెడ్డి వెళ్లడి

తిరుపతి సాక్షి  : భారత దేశంలో గుండె పోటు బాధితుల  సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో  చాల మంది ప్రముఖులు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం చూస్తున్నాం. గత వారం కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ (46) వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో మరణించడం తెలిసిందే. ప్రఖ్యాత క్రికెట్‌ ఆటగాళ్లు సౌరవ్‌ గంగూలి, బ్రియన్‌ లారా వంటి ఆటగాళ్లు కూడా మధ్య వయస్సులో గుండె పోటుకు గురి అయ్యారు. ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా గుండె పోటు నుండి తప్పించుకోలేకపోతున్నారు.

శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఆందోళన, ఒత్తిడి, మన ఆధునిక ఆహారపు అలవాట్లు, ధూమపానం, మధ్యపానం, ఘగర్, బీపీ, స్థూల కాయం ఉన్న వారిలో ఈ జబ్బు అధికంగా వచ్చే అవకాశం ఉంది. వ్యాయామం కానీ,అతి డైటింగ్‌ ,నిద్ర పోవడం వంటి కార్యకలాపాలను పరిమితంగా చేయాలి లేదా ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో హ్తె ప్రొటీన్‌ డైట్‌ ఇచ్చిన ఎలుకల్లో గుండెపోటు అధికంగా వచ్చినట్లు తేలింది. 

వైద్య నిపుణులు, వైద్యుల అభిప్రాయం ప్రకారం చికిత్సతోపాటు జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మెజారిటీ గుండెపోటు మరణాలు సమయానికి ఆస్పత్రికి చేరుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రాణాలతో బయట పడే ఛాన్స్‌ ఉందని అభిప్రాయపడుతున్నారు. చాలా కేసులలో బాధితులకు ఛాతిలో నొప్పి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆస్పత్రిలో చేరుతున్నారని.. అయితే అప్పటికే జరుగాల్సిన నష్టం జరుగుతుందని అంటున్నారు. 

ఎవరికైనా గుండెపోటు వచ్చిన గంటసేపటి వరకు కూడా శరీరానికి రక్తసరఫరా జరుగుతుందని.. ఇందులో మొదటి గంట తర్వాతనే రక్త ప్రసరణ ఆగిపోతుందని వైద్యులు అంటున్నారు. అందుకే గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్‌ అవర్‌ లేదా గోల్డెన్‌ టైమ్‌ అని అంటారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ గంట సమయంలోగా ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు.

హృదయ స్పందనలో ఏం జరుగుతుంది
గుండె కొట్టుకోవడంలో కొంత సమస్య మొదలవుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే చికిత్స చేస్తే పల్స్‌ తిరిగి మొదలవుతుంది. ఇలా వెంటనే చికిత్స అందించడం వల్ల రోగి జీవితాన్ని కాపాడవచ్చు. ఈ పనిని ఇంజెక్షన్‌ ద్వారా లేదా యాంజియోప్లాస్టీ ద్వారా చేస్తారు. అటువంటి పరిస్థితిలో కార్డియాలజిస్ట్‌ బాధితుడిని మరణం నుండి రక్షించగలరు. చాలా మంది రోగులు గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే మరణిస్తారు.

గుండెపోటులో 50 శాతం మొదటి గంటలోనే సంభవిస్తాయి. అందువల్ల, మొదటి గంటలో దానిని గుర్తించడం.. చికిత్స చేయడం చాలా ముఖ్యం. ఇలాంటి లక్షణాలను గుర్తించడం.. వెంటనే ఈ రోగిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం.

ప్రాథమిక చికిత్స ఎలా ఉండాలి
గుండెపోటు వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి? అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. గుండెపోటు వచ్చిన వెంటనే మొదట ఆస్పిరిన్‌ మాత్రను అందించాలి. ప్రారంభ చికిత్స సమయంలో ఇంజెక్షన్‌ సుమారు 1 నుంచి 60–70 శాతం వరకు సక్సెస్‌ ఉంటుంది. యాంజియోప్లాస్టీ 90% కంటే ఎక్కువ విజయవంతమైంది. 

ఒత్తిడిని నియంత్రించుకోవాలి..
గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ఒత్తిడి. మన దానిని జయించినట్లయితే చాలా వరకు హదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో చిట్కా పాటిస్తుంటారు. కొందరు అంకెలను 1 నుండి 100 వరకు లెక్క పెట్టుకుంటే..తిరిగి 100 నుండి 1 వరకు లెక్కపెట్టి మనస్సుసై ఏకాగ్రత కోసం ప్రయత్నిస్తుంటారు. ఇంకొందరు శ్వాస నిశ్వాసలపై ఏకాగ్రత పెడుతుంటారు. మరి కొందరు తమకు ఇష్టమైన పాటలు వినడమో.. లేక పుస్తకాలు చదవడమో చేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి ఒత్తిడి దూరం అవుతుంది. ఒత్తిడి అధికంగా ఉన్న వారిలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది.

గుండె పోటుకు ముందు కనిపించే లక్షణాలు..
షుగర్‌, బీపీ వ్యాధిగ్రస్తులకు ఉన్నట్టుండి ఛాతీ భాగం, మెడ భాగంలో నొప్పులు వచ్చి చెమటలు పడుతుంటాయి.
శరీరం పై భాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే తప్పకుండా గుండె నొప్పి రాబోతుందని గుర్తించాలి.
గుండె భారంగా.. అసౌకర్యంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
మత్తు లేదా మగతగా ఉన్నా, చెమటలు ఎక్కువగా పడుతున్నా గుండె నొప్పికి సూచనగా అనుమానించాలి.
తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు వస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదు.
కొందరికి దవడలు, గొంతు నొప్పులు కూడా గుండె నొప్పికి సంకేతాలు.
వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా గుండెనొప్పికి దారితీస్తాయి. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.
గుండె సమస్యలుంటే.. తప్పకుండా హార్ట్‌ బీట్‌ను చెక్‌ చేసుకోవాలి. అసాధారణంగా గుండె కొట్టుకున్నట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడతారు. ఈ లక్షణం కనిపిస్తే తప్పకుండా అప్రమత్తం కావాలి.
రక్త సరఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటే వైద్యుడిని సంప్రదించాలి.
తరచుగా జలుపు, జ్వరం, దగ్గు వస్తున్నా.. అవి ఎంతకీ తగ్గకపోయినా అనుమానించాలి. ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలే.  

మరిన్ని వార్తలు