కుండపోత వర్షంతో.. మహోగ్ర కృష్ణా!

28 Sep, 2020 04:43 IST|Sakshi
కృష్ణా నదికి వరద పోటెత్తడంతో నాగార్జున సాగర్‌ 20 గేట్లను తెరిచారు. ఆదివారం రాత్రి విద్యుత్‌ వెలుగుల నడుమ దిగువకు ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ

శ్రీశైలంలోకి 5,10,750 క్యూసెక్కుల ప్రవాహం

ఈ సీజన్‌లో కృష్ణా నదిలోకి ఇదే గరిష్ట వరద..

సాగర్‌లోకి 5.84 లక్షల క్యూసెక్కులు.. 20 గేట్లు ఎత్తివేత

సాక్షి, హైదరాబాద్‌: పరీవాహక ప్రాంతంలో కుండపోత వర్షంతో కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది.. ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 63 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌కు దిగువన పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణాలో వరద ఉధృతి పెరిగింది. జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్న 4.35 లక్షల క్యూసెక్కులకు సుంకేశుల బ్యారేజీ నుంచి విడుదల చేసిన 77 వేల క్యూసెక్కుల తుంగభద్ర నదీ జలాలు కలుస్తుండటంతో.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,10,750 క్యూసెక్కులు చేరుతోంది. ఈ సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటం, 884 అడుగుల్లో 210.03 టీఎంసీలు నిల్వ ఉండటం తో.. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తేసి, కుడి గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 5,94,580 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 

ఇక నాగార్జునసాగర్‌లోకి 5,84,216 క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్‌లో 589.7 అడుగుల్లో 311.15 టీఎంసీలను నిల్వ చేస్తూ.. 20 గేట్లను ఎత్తి 6,67,216 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 

సాగర్‌ నుంచి విడుదల చేస్తున్న జలాలకు మూసీ వరద తోడవ్వడంతో పులిచింతల ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 6,35,244 క్యూసెక్కులు చేరుతుండగా, 15 గేట్లు, విద్యుత్‌ కేంద్రం ద్వారా 6,06,719 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 

పులిచింతల నుంచి వదులుతున్న జలాలకు వైరా, మున్నేరు, కట్టలేరు, కొండవాగుల నుంచి వస్తున్న వరద తోడవ్వడంతో ప్రకాశం బ్యారేజీలోకి కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. బ్యారేజీలోకి వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. ఆదివారం రాత్రికి 7 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశముండటంతో 70 గేట్లను ఎత్తేసి.. వచ్చిన వరదను వచ్చినట్టుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 

గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఉపనది మంజీర నుంచి సింగూరులోకి 9,286 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 23.18 టీఎంసీలకు చేరుకుంది. మరో 6 టీఎంసీలు చేరితే సింగూరు నిండుతుంది. నిజాంసాగర్‌లోకి 7,878 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 7.34 టీఎంసీలకు చేరుకుంది. నిజాంసాగర్‌ నిండాలంటే ఇంకా 10 టీఎంసీలు అవసరం. మానేరు ఉప్పొంగుతుండటం తో ఎగువ మానేరు, మధ్య మానేరు, దిగువ మానేరు డ్యామ్‌ల గేట్లను ఎత్తారు. ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి 1.56 లక్షలకు చేరింది. ప్రాజెక్టు ఇప్పటికే నిండిపోవడంతో గేట్ల ద్వారా 1.68 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.  

ధవళేశ్వరం బ్యారేజీలోకి గోదావరి నది నుంచి 3.95 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 8 వేల క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 3.87 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు