కళ్లలో నీళ్లు.. కాలనీల్లో నీళ్లు..

18 Oct, 2020 09:46 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : భారీ వర్షాలకు నగరంలోని కాలనీల్లో, అపార్టుమెంట్లలో నిలిచిపోయిన నీళ్లతో ప్రజలు పడుతున్న పాట్లు చూసి అందరూ వేదన చెందుతున్నారు. ఈ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వాలు ఏళ్ల తరబడి చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. వానొస్తే కాలనీల్లో.. ప్రజల కళ్లలో నీళ్లు రాకుండా చేయాలంటే వేల కోట్లు ఖర్చుచేయడమే కాదు.. ఎన్నో భవనాలు, అపార్ట్‌మెంట్లను కూల్చివేయాల్సి ఉంది. అక్రమమో.. సక్రమమో నాలాలను  మూసేసి, నాలా స్థలాలను ఆక్రమించి  ఒకటినుంచి ఆరంతస్తుల వరకు భవనాలు నిర్మించారు. కాల‘నీళ్ల’ సమస్య పరిష్కారం కావాలంటే వీటిని కూల్చనిదే సాధ్యం కాదు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

అందుకు ఏ ప్రభుత్వమూ పూనుకోదన్నది నగర ప్రజలకు అనుభవైకవేద్యమే. ఇందుకు కారణాలనేకం. టీఆర్‌ఎస్‌ సైతం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఈ సమస్య పరిష్కారానికి వెరవబోమని ప్రకటించింది. ఆ తర్వాత భవనాలను కూల్చుకుంటూ పోతే జాతీయ సంపదను నాశనం చేయడమేననే అభిప్రాయానికి వచ్చింది. కనీసం బాటిల్‌నెక్స్‌ తొలగించేందుకు సైతం వెనుకంజ వేసింది. నాలాల లోతును పెంచి ఎక్కువ వరద నీరు సాఫీగా పోయేలా మార్గాలు అన్వేషించాల్సిందిగా ఇంజినీర్లకు సూచించింది. ఒకవేళ కూల్చివేతలు చేపట్టినా ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి ఆందోళనలు తప్పవు. ఇప్పుడు విమర్శిస్తున్న ప్రజలే విలపించే పరిస్థితి ఎదురవుతుంది. ప్రతిపక్షాలను పట్టించుకోకున్నా, ప్రజలను పట్టించుకోక తప్పదు. అందుకే నగరంలో నాలాల సమస్యలకు, కాలనీల కన్నీళ్లకు పరిష్కారం కష్టమవుతోంది.  (హైదరాబాద్‌ మరోసారి మునక)

తడి ఆరే కన్నీళ్లు..
వానబాధల్లో విమర్శించే వారే వానలు వెలిసి పరిస్థితి  కుదుట పడ్డాక  కూల్చివేతలకు  ఒప్పుకోని పరిస్థితులున్నాయి. నీళ్లు నిలిచే  వాటిల్లో నాలాలు, చెరువు భూముల్లో నిర్మించిన  భవనాలే  ఎక్కువగా ఉంటాయి.   ఏపదేళ్లకో  వచ్చే  భారీవానల కోసం భవనాలు కూలుస్తారా అనే ప్రశ్నలతో అధికారులు ముందుకు సాగలేని పరిస్థితి.  నాలుగైదు రోజుల వాన తిప్పలేవో మేమే పడతాం కానీ కూల్చొద్దంటూ గతంలో ప్రజలనుంచి పలు పర్యాయాలు వచ్చిన విజ్ఞప్తులను జీహెచ్‌ఎంసీ అధికారులు  గుర్తుచేస్తున్నారు.
 

స్వల్పకాల సమస్యల కోసం భారీ మూల్యం చెల్లించే పనులు చేయరాదని ఇంజినీరింగ్‌ సూత్రాల్లో కూడా ఉందని ఉన్నతహోదాలోని రాష్ట్రస్థాయి ఇంజినీర్‌ ఒకరు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చేయగలిగిందేమంటే.. ముందస్తు వాతావారణ సూచనలతో అప్రమత్తమై గండం గడిచేంత వరకు ప్రజలకు ఎలాంటి  ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం  అవసరమైన విస్తృత చర్యలు చేపట్టడమేనని పట్టణ ప్రణాళిక నిపుణలు అభిప్రాయ పడుతున్నారు. అసలు అక్రమ భవనాలు రాకముందే నిలువరించాలని ఆ అంశంలో రాజకీయ ప్రభావం, అధికారుల అవినీతి, తక్కువ ధరకు లభిస్తాయనే ప్రజల ఆశ తదితర అంశాలు ఇమిడి ఉన్నాయని పేర్కొంటున్నారు.

సిఫార్సుల అమలు కష్టం..
నగరానికి వరద  ముంపు సమస్యలు లేకుండా చేయాలంటే 28వేల అక్రమ నిర్మాణాలు తొలగించాలని కిర్లోస్కర్, వాయెంట్స్‌  కన్సల్టెన్నీ సంస్థలు సిఫార్సు చేశాయి. సాధ్యం కాదని భావించి బాటిల్‌నెక్స్, మేజర్‌ వాటర్‌ స్టాగ్నేషన్‌ ప్రాంతాల్లో పరిష్కార చర్యలకు సిద్ధమయ్యారు. అత్యంత సమస్యాత్మకంగా ఉన్న  దాదాపు వంద కి.మీ.ల మేర అయినా నాలాల్లో వరదనీరు సాఫీగా వెళ్లేలా చేయాలనుకున్నారు. తొలుత 50 కి.మీ.ల మేర సాఫీగా వెళ్లేందుకు బాటిల్‌నెక్స్, ఇతర పనులు వెరసి దాదాపు 130 పనులు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిల్లో   1600కు పైగా ఆక్రమణలుండగా, 500 కు పైగా నిర్మాణాలు తొలగించారు. వీటిల్లో షెడ్లు, ప్రహరీలు వంటివి ఉన్నాయి.  ఇవి కాక 300కు పైగా భవనాలున్నాయి. ఈపనులు చేసేందుకు అంచనా వ్యయం దాదాపు రూ. 700 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.125  కోట్లతో దాదాపు 30 పనులు పూర్తిచేశారు. మొత్తం 30 కి.మీ.ల మేర విస్తరణ పనులకు మార్గం సుగమం కాగా 23 కి.మీ.ల మేర పనులు చేశారు. 
 

మరిన్ని వార్తలు