Telangana: రికార్డు స్థాయిలో వర్షాలు.. 4,943 చెరువులు ఫుల్‌

24 Jul, 2021 01:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గడిచిన మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రికార్డు స్థాయిలో చెరువులు నిండుతున్నాయి. ఇప్పటికే 9 వేలకు పైగా చెరువులు పొంగి పొర్లుతుండగా, మరో 7 వేల చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 19 ఇరిగేషన్‌ డివిజన్‌ల పరిధిలో మొత్తంగా 43,870 చెరువులు ఉండగా, అందులో గురువారానికే 4,698 చెరువులు అలుగు దూకాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం రోజంతా వర్షాలు కురవడంతో మరో 4,943 చెరువులు నిండాయి. మొత్తంగా 9,641 చెరువులు నిండు కుండల్లా మారి పొర్లుతున్నాయి. మరో 8,476 చెరువులు ఏ క్షణమైనా నిండే అవకాశం ఉందని ఇరిగేషన్‌ శాఖ గుర్తించింది. ములుగు, వరంగల్, ఆదిలాబాద్‌ డివిజన్‌లలో వెయ్యికిపైగా చెరువులు నిండటం విశేషం. చెరువుల కింద 22 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, ఈ వానాకాలంలోనే 20 లక్షల ఎకరాలకు నీరం దే అవకాశాలున్నాయని ఇరిగేషన్‌ శాఖ అంచనా. 

చెరువు కట్టలపై అప్రమత్తం
ఇప్పటివరకు కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 20 చెరువులు పాక్షికంగా దెబ్బతిన్నాయని నీటిపారుదల శాఖకు నివేదికలు అందాయి. ముఖ్యంగా వర్షాలు అధికంగా ఉన్న ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, నిజామాబాద్‌ జిల్లాల్లో చెరువుల కట్టలు తెగడం, బుంగలు పడటం వంటివి సంభవించాయని చెబుతున్నారు. నిర్మల్‌లో 3 చెరువుల కట్టలు పూర్తిగా తెగాయని చెబుతున్నారు. కట్టలు తెగిన చోట ఇప్పటికే తక్షణ చర్యలు మొదలయ్యాయి. ఇక ఆగస్టు వరకు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉండటం, ఇప్పటికే చెరువులు నిండిన నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, కట్టలు, తూములు, కాల్వలపై పర్యవేక్షణ పెంచాలని శుక్రవారం జలసౌధ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈఎన్‌సీలు మురళీధర్, నాగేంద్రరావు అన్ని డివిజన్‌ల ఇంజనీర్లను ఆదేశించారు. 

నిండిన మధ్యతరహా ప్రాజెక్టులు
మధ్యతరహా ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండుతున్నాయి. గోదావరి బేసిన్‌లో ఇప్పటికే 90 శాతం నిండ గా, కృష్ణాలోనూ ఇదేమాదిరి వర్షాలు కొనసాగితే ఒకట్రెండు రోజుల్లోనే పూర్తిగా నిండనున్నాయి. ముఖ్యంగా నిర్మల్‌ జిల్లాలోని పెద్దవాగుకు ఏకంగా 3.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా, కుమ్రంభీం ప్రాజెక్టుకు 58 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు వస్తున్నాయి. ఇవన్నీ ఇప్పటికే నిం డటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వది లేస్తున్నారు. స్వర్ణకు 24 వేల క్యూసెక్కులు, సుద్ద వాగుకు 18 వేలు, శనిగరంకు 12 వేలు క్యూసెక్కుల చొప్పున ప్రవాహాలు కొనసాగుతున్నాయి.  

మరిన్ని వార్తలు