మళ్లీ ముంచేసింది..

18 Oct, 2020 01:13 IST|Sakshi

కమ్మేసి... కుమ్మేసిన వరుణుడు

హైదరాబాద్‌పై క్యుములోనింబస్‌ గర్జన

ఉరుములు, మెరుపులతో జోరువాన

రాజధాని గజగజ

మరోసారి మునక

ఏరులై పారిన ప్రధాన రహదారులు

మలక్‌పేటలో స్తంభాన్ని పట్టుకొని వ్యక్తి మృతి

సాక్షి, హైదరాబాద్‌: వరుణుడు హైదరాబాద్‌పై కత్తిగట్టాడు. వీడకుండా వెంటాడుతున్నాడు. వం దేళ్లలో ఎన్నడూ చూడని వర్షం నాలుగైదు రోజుల కిందట మహానగరాన్ని నిండా ముంచగా... శని వారం సీన్‌ రిపీటైంది. వర్షం మళ్లీ హడలెత్తించింది. ఉరుములు, మెరుపులతో కూడిన క్యుములోనిం బస్‌ మేఘాల తీవ్రతతో శనివారం రాత్రి హైదరా బాద్‌ మళ్లీ వణికిపోయింది. మంగళ, బుధ వారాల్లో కురిసిన రికార్డు వర్షం తాలూకు వరదతో కాలనీలు ఇంకా తేరుకోకముందే వరుణుడు పగబట్టిన రీతిలో... మళ్లీ ఆ ప్రాంతాల్లోనే శనివారం సైతం కుండపోతగా వర్షం కురిసింది. శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి హయత్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్‌ పేట, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, మీర్‌పేట, పోచారం, ఘట్కేసర్‌లలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.

హైదరాబాద్‌– వరంగల్, హైదరాబాద్‌ – విజయవాడ ప్రధాన రహ దారితో పాటు నగరంలోని రహదారులు పూర్తిగా జలమయమై ఈ రెండు రూట్లలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. చినుకుపడితేనే గజగజ వణుకుతు న్న నగరవాసులు ఇంటికి చేరేందుకు తొందరపడ టంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించింది. పాతబస్తీలోని ఛత్రినాకలో వరదనీటిలో పలు వాహæనాలు మళ్లీ కొట్టుకుపోయాయి. ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పైభాగంలో భారీ గొయ్యి పడటంతో బ్రిడ్జిని మొత్తం మూసేశారు. పాతబస్తీ బాబానగర్‌ పరిధిలో ని గుర్రంచెరువు గండి మరింత పెద్దది కావటంతో వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే ఉప్పల్, ఎల్బీ నగర్, అంబర్‌పేట ప్రాంతాల్లో నాలుగు రోజులుగా వరదనీటిలోనే మునిగిన కాలనీల్లో శనివారం నాటి వర్షం పరిస్థితిని మళ్లీ మొదటికి తెచ్చింది. 

తేరుకునేలోపే... మళ్లీ వరద
నాగోలు బండ్లగూడ, సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్‌లో ఇటీవల మునిగి ఈ రోజే కాస్త ఉపశమనం పొందిన కాలనీలు, ఇళ్లలోకి శనివారం రాత్రి మళ్లీ వరద నీరు వచ్చి చేరింది. నాగోలు బండ్లగూడ పరిధిలోని సాయినగర్, ఆదర్శనగర్, ఎల్బీనగర్‌ పరిధిలోని హరిహరపురం, మిథులానగర్, మల్లికార్జుననగర్, బంజారాకాలనీ, రెడ్డికాలనీ, బైరామల్‌గూడ, హబ్సి గూడ రవీంద్రనగర్, లక్ష్మీనగర్, సాయిచిత్రనగర్, మధురానగర్‌లో వరద నీరు మరో అడుగు మీదకు చేరింది. బీఎన్‌రెడ్డి డివిజన్‌ కప్రాయి చెరువు పరిసరా ల్లోని హరిహరపురంకాలనీ, గాంధీనగర్‌కాలనీ సహా మీర్‌పేటలోని మంత్రాల చెరువు కింద ఉన్న మిథు లానగర్, సాయినగర్‌ కాలనీలతో పాటు హయత్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని బంజారాకాలనీ, వనస్థ లిపురం కాలనీ పరిధిలోని మల్లికార్జున కాలనీలు గత నాలుగు రోజుల నుంచి నీటిలోనే ఉండిపో యాయి. మూడు రోజుల నుంచి వర్షం లేకపోవ డంతో వరద తగ్గుముఖం పడుతుందని భావించి ఊపిరిపీల్చుకునే లోపే మరోసారి వరదనీరు ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


శనివారం రాత్రి హైదరాబాద్‌ చైతన్యపురిలో భారీ వర్షానికి జలమయమైన ఓ కాలనీ

బైరామల్‌గూడచెరువు పరిసరాల్లోని రెడ్డికాలనీ, వందనపురికాలనీ, కాకతీయనగర్‌ కాలనీ, బైరామల్‌గూడ కాలనీలు... సరూర్‌నగర్‌ చెరువుకు ఆనుకుని ఉన్న గ్రీన్‌పార్క్‌ కాలనీ, లింగోజిగూడ, ధర్మపురి కాలనీ, గౌతంనగర్, మన్సూరాబాద్‌లోని సరస్వతినగర్‌ కాలనీలకు మళ్లీ వరద పోటెత్తింది. బండ్లగూడ చెరువుకు భారీగా వరదనీరు వచ్చి చేరడంతో చెరువు కింది భాగంలో ఉన్న కాలనీలు జలమయమయ్యాయి. నాలుగు రోజులుగా వరదలో చిక్కుకున్న కాలనీలకు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఆయా కాలనీల్లో అంధకారం నెలకొంది. కాగా మలక్‌పేట పోచమ్మ దేవాలయ సమీపంలోని విద్యుత్‌ స్తంభాన్ని ముట్టుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాములు(40) అక్కడికక్కడే మరణించాడు.

ఉప్పల్‌ నుంచి నాగోల్‌ రహదారిలో భారీగా స్తంభించిన ట్రాఫిక్‌  

ఉప్పల్, మేడ్చల్‌లో జోరువాన...
ఘట్కేసర్, ఫిర్జాదిగూడ, ఉప్పల్‌ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. ఉప్పల్‌ నుంచి చిలుకానగర్‌ వైపు వెళ్లే రోడ్డులో కావేరీనగర్, న్యూభరత్‌నగర్, శ్రీనగర్‌ కాలనీ, తదితర ప్రాంతాల్లో వరదతో పాటు ఇళ్లల్లోకి చేరిన బురదతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలను ఈ వర్షం మరింత ఆందోళనకు గురిచేసింది. ఉప్పల్‌ బస్‌స్టేషన్‌ నుంచి బోడుప్పల్‌ వెంకటేశ్వర టెంపుల్‌ వైపునకు వెళ్లే మార్గంలో సౌత్‌స్వరూప్‌నగర్‌ నాలాలోకి మరోసారి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీశ్రీనగర్, ద్వారకానగర్, పద్మావతికాలనీ, తదితర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మల్కాజిగిరిలోని ఎన్‌ఎండీసీనగర్, షిరిడీనగర్, అల్వాల్‌ శివానగర్, దినకర్‌నగర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కాలనీల్లోకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరింది. మంగళవారం 33 సెంటీమీటర్ల ఆల్‌టైం రికార్డ్‌ వర్షపాతం కురిసిన పోచారం, ఘట్కేసర్‌లలోనూ శనివారం మరోసారి కుండపోత స్థానికులను భయకంపితులను చేసింది.

హైవేలపై మళ్లీ రాకపోకలు బంద్‌
హైదరాబాద్‌ –విజయవాడ రహదారిపై చైతన్యపురి, చింతలకుంట, అబ్దుల్లాపూర్‌మెట్‌ ఇనాంగూడ వద్ద భారీగా వరద నీరు చేరటంతో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. వరంగల్‌ – హైదరాబాద్‌ రూట్‌లో నారపల్లి – జోడిమెట్ల, ఉప్పల్‌ చెరువు వద్ద వరద నీరు చేరటంతో వాహనాలను అనుమతించలేదు. 

హిమాయత్‌సాగర్‌ 3 గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వస్తుండటంతో శనివారం రాత్రి 9 – 10 గంటల మధ్యలో మూడు గేట్లు ఎత్తి వేశారు. ప్రస్తుతం నాలుగు గేట్ల ద్వారా నాలుగు అడుగుల వరద నీరు దిగువ ప్రాంతానికి వెళుతోంది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు. 

క్యుములోనింబస్‌ వల్లే
హైదరాబాద్‌ సహా వివిధ జిల్లాల్లో శనివారం కురిసిన వర్షం క్యుములోనింబస్‌ మేఘాల వల్లేనని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర అధికారి నాగరత్న తెలిపారు. తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం కాదని చెప్పారు. వచ్చే రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు

పాతబస్తీ అతలాకుతలం.. 
వర్షం దంచికొట్టడంతో శనివారం మరోసారి పాతబస్తీ అతలాకుతలమైంది. గుర్రం చెరువు వరద నీరు పాతబస్తీని ముంచె త్తింది. మళ్లీ కాలనీలు నీటమునగడంతో మూలి గే నక్క మీద తాటిపండు పడ్డట్లు తయారైంది పరిస్థితి.   మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ఓపెన్‌ నాలాలు పొంగి పోతున్నాయి.
నాలాలకు పక్కనున్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. 
వృక్షాలు కూలిపోయి విద్యుత్‌ వైర్లపై పడటంతో అక్కడక్కడ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.
చాంద్రాయణగుట్ట నియెజకవర్గంలోని అల్‌జుబేల్‌ కాలనీ, హషమాబాద్, క్రాంతినగర్, శివాజీనగర్, అరుంధతినగర్‌ కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి.
యాకుత్‌పురా నియోజకవర్గంలోని గంగానగర్, పటేల్‌నగర్, ముర్తుజానగర్, గౌలిపురాలోని నల్లపోచమ్మ బస్తీ, లలితాబాగ్‌ రైల్వే బ్రిడ్జి తదితర బస్తీలను వరదనీరు ముంచెత్తింది.
మీరాలంమండి కూరగాయల మార్కెట్‌ వరద నీటితో నిండిపోయింది. 
డీఆర్‌డీఓ ప్రహరీగోడ కూలింది. 

మరిన్ని వార్తలు