Telangana: రెండు రోజులు భారీ వర్షాలు

20 Jun, 2022 00:31 IST|Sakshi

వాతావరణ శాఖ సూచన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశంఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి అంతర్గత తమిళనాడు వరకు కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ద్రోణి ఆదివారం విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించింది.

ఇది సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 3.4 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదైంది.

వానాకాలం సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19వ తేదీ నాటికి 8.28 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 5.76 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. రాష్ట్రంలోని 2 జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం ఉండగా... మరో 20 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. 7 జిల్లాల్లో సాధారణ, 2 జిల్లాల్లో అధికం, మరో రెండు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం రుతుపవనాలు రాష్ట్రమంతటా వ్యాప్తి చెందుతుండటంతో త్వరలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు