రాత్రి 11 గంటలకూ ‘దారికి’ రాని వైనం

18 Oct, 2020 09:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని రోడ్లపై వాహనశ్రేణులు నత్తలతో పోటీ పడ్డాయి. రెండు రోజుల క్రితం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో రోడ్లు ఛిద్రం కాగా..శనివారం రాత్రి హఠాత్తుగా కురిసిన భారీ వర్షం తోడైంది. దీంతో రోడ్లన్నీ జలమయమై ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటరు దూరం దాటడానికి కనీసం అరగంటకు పైగా పట్టిందంటే అతిశయోక్తి కాదు. ఇంకొన్ని చోట్ల గంటల తరబడి వాహనాలు ముందుకు కదలనే లేదు. వర్షం నేపథ్యంలో ద్విచక్ర వాహనచోదకులు మెట్రోరైల్‌ స్టేషన్ల కింద ఆగిపోవడంతో ఆ ప్రాంతాల్లో మరిన్ని ఇబ్బందులు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వీకెండ్‌లో రోడ్డెక్కిన వాహనాలకు, చోదకుల ఒళ్లు హూనమై పోయింది. సుదీర్ఘకాలం నిరీక్షణతో వారి సహనానికి పరీక్షగా మారింది. అనేక ప్రాంతాల్లో రాత్రి పదకొండు గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. 

  • సాధారణ రోజుల్లోనే పీక్‌ అవర్స్‌గా పరిగణించే ఉదయం, సాయంత్రం వేళ నగరంలో ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడుతుంటాయి. వరుస వర్షాలు, వరదల తర్వాత శనివారం అనేక మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. దీంతో సాధారణంగా రోడ్లపై రద్దీ పెరిగింది. హఠాత్తుగా రాత్రి వర్షం కురవడంతో రోడ్డంతా అధ్వానంగా మారిపోయి తీవ్ర ఇబ్బందులకు కారణమైంది. అప్పటికే పూర్తిగా నాని ఉన్న రోడ్లపై నీరు ఇంకలేదు. ప్రతి నీటు బొట్టూ ప్రవాహంగా మారి వాహనాలను ఆపేసింది. 
  • నగర వ్యాప్తంగా దాదాపు 67 ప్రాంతాల్లో ఉన్న వాటర్‌ లాగింగ్‌ ఏరియాల కారణంగా రోడ్లన్నీ చెరువులుగా మారి ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడ్డాయి. ఇది నిత్యకృత్యమే అయినప్పటికీ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్డన్నీ ఛిద్రం కావడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. 
  • అనేక ప్రాంతాల్లో తారు కొట్టుకుపోయి, రాళ్లు బయటపడటంతో పాటు గోతులు సైతం ఏర్పడ్డాయి. శనివారం రాత్రి వర్షానికి వీటన్నింటిలో నీళ్లు నిండటంతో ఏది గొయ్యే, ఏది రోడ్డో అర్థంకాక వాహనచోదకులు తమంతట తామే వాహన వేగాలను తగ్గించేసుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ రహదారులపై వాహన శ్రేణులు నిలిచిపోయాయి.

 

  • కీలక మార్గాల్లోనూ అత్యంత నెమ్మదిగా ముందుకు సాగాయి. నాగోలు–మెట్టుగూడ, సికింద్రాబాద్‌–బేగంపేట్, ఎల్బీనగర్‌–చాదర్‌ఘాట్, ఎంజే మార్కెట్‌–నాంపల్లి, పంజగుట్ట–కూకట్‌పల్లి ప్రాంతాల్లో వాహనాలు భారీ సంఖ్యలో ఆగిపోయాయి. నగరం చుట్టూ ఉన్న విజయవాడ, వరంగల్, ముంబై, కరీంనగర్‌ హైవేలపై నీరు ప్రవహిస్తూ వాహనాలు ఆగిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడ్డాయి.

  • విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వాహనాలను ఔటర్‌ రింగ్‌ రోడ్‌ మీదుగా మళ్లించారు. మంగళ-బుధ వారాల్లో కురిసిన వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాల్లో చెట్లు కూలడంతో పాటు కొమ్మలు, కేబుల్‌ వైర్లు సైతం తెగిపడ్డాయి. మరికొన్ని చొట్ల కటౌట్లు, హోర్డింగ్స్‌ రోడ్ల మీద కుప్పకూలాయి. వీటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ ఇతర విభాగాల సిబ్బంది ఓపక్క ప్రయత్నిస్తూనే ఉండగా... శనివారం కురిసిన వర్షం రహదారుల్ని వాహనచోదకులకు నరకంగా మార్చింది. రోడ్లన్నీ జామ్‌ కావడంతో గంటల తరబడి అవి రోడ్ల పైనే ఉండిపోయాయి. 

  • వర్షం, ఛిద్రమైన రోడ్లు, ఆగిపోయిన ట్రాఫిక్‌ కారణంగా వాహనాల మైలేజ్‌ కూడా ఘోరంగా పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కార్లు వంటి వాహనాలు కేవలం ఒకటి, రెండు గేర్లలో మాత్రమే కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుండటంతో ఇంధనం ఎక్కువగా వినియోగించాల్సి వచ్చింది. 
  • మరోపక్క వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న రోడ్ల కారణంగా వాహనాలతో పాటు చోదకులు శరీరాలూ హూనం అయ్యాయి. గోతులు, రాళ్లను కప్పేస్తూ రహదారులపై ప్రవహిస్తున్న నీరు కారణంగా వాటిని గుర్తించడం వాహనచోదకులకు కష్టంగా మారి వాటిలోకే వెళ్లడంతో ఇలా జరిగింది. దీంతో కొన్ని వాహనాలు వాటిలో పడటంతో టైర్లతో పాటు వీల్‌ అలైన్‌మెంట్లు తదితరాలు దెబ్బతిన్నాయి. ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే ఇవి గోతుల్లో పడుతున్న కారణంగా షాక్‌ అబ్జర్వర్లు దెబ్బతినడంతో పాటు చోదకుల వెన్నుముక, మెడ వంటి అవయవాలకూ ఇబ్బందులు ఏర్పడ్డాయి.

తీవ్రంగా ట్రాఫిక్‌జామ్స్‌ ఏర్పడిన ప్రాంతాల్లో కొన్ని...
ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, చాదర్‌ఘాట్‌, ఎంజీబీఎస్‌, సికింద్రాబాద్‌, బేగంపేట, ముషీరాబాద్‌, అమీర్‌పేట్‌, అబిడ్స్‌, కోఠి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, నల్లకుంట, ఎంజే మార్కెట్‌, జీపీఓ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాసబ్‌ట్యాంక్‌, టోలిచౌకి, రవీంద్రభారతి, లక్డీకాపూల్‌, హిమాయత్‌నగర్‌,  సోమాజిగూడ, పంజగుట్ట, తార్నాకతో పాటు నగరం చుట్టూ ఉన్న అన్ని జాతీయ రహదారుల్లోనూ ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా