సరూర్‌ నగర్‌ చెరువు నిండి కాలనీల్లో వరద

18 Oct, 2020 13:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో శనివారం కురిసిన భారీ వర్షంతో మరోసారి లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు, రోడ్లు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు సరూర్ నగర్ చెరువు నిండి సమీపంలోని కాలనీలకు వరద నీరు ప్రవహిస్తోంది. చెరువు నిండి దిల్సుఖ్‌నగర్‌లోని కమలానగర్‌లో వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ కాలనీలన్నీ జలమయం అయ్యాయి. శనివారం నుంచి కరెంట్ లేక తాగడానికి నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు‌. అపార్ట్‌మెంట్ వాసులు కిందికి దిగే పరిస్థితి కనిపించడం లేదు. నిత్యవసర సరుకులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరద తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలు భయాందోలనలో‌ బతుకుతున్నారు. వర్షం, వరద నీటితో దిల్‌సుఖనగర్ ప్రధాన రోడ్డు స్థబించి, ఎల్‌బీ నగర్, నల్గొండ నుంచి వచ్చే వాహనలు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి.

దిల్‌సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం సమీప కాలనీల నుంచి వస్తున్న వరద నీరుతో ప్రధాన రహదారి జలదిగ్భందమవడం వల్ల వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దిల్‌సుఖ్ నగర్‌లోని సెల్లార్లలో ఉన్న పలు వస్త్ర దుకాణాలన్నీ వరద నీటిలో మునిగిపోవడంతో భారీ నష్డం వాటిల్లింది. దాదాపు 35 బట్టల దుకాణాలు నీటిలో మునిగాయని, అధికారులు మోటర్ల సాయంతో నీటిని తోడేస్తే కొంతలో కొంతైన బట్టలు చేతికి దక్కుతాయని లేదంటే పూర్తిగా నష్టం వాటిల్లుతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనప్రియ, మీర్‌పేటలో రోడ్లు జలయమం అయ్యాయి. పెద్దచెరువు నిండటంతో పలు కాలనీలు నీటమునిగాయి. చెరువుకి గండిపడటంతో జనప్రియ కాలనీలోకి వరద నీరు తీవ్ర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు