వరదల్లో చిక్కుకున్న పెయింటర్లు

23 Jul, 2021 07:32 IST|Sakshi

సాక్షి, సారంగాపూర్‌(ఆదిలాబాద్‌): మండలంలోని వంజర్‌ మహాలక్ష్మి ఆలయానికి రంగులు వేయడానికి వెళ్లిన నాగేంద్ర, నవీన్, రవి అనే ముగ్గురు యువకులు గురువారం వరదనీటితో ఆలయంలో చిక్కుకుపోయారు. బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఆలయానికి పక్కనే ఉన్న వాగు ఉధృతంగా ప్రవహించి వరద నీరు ఆలయానికి చుట్టుపక్కలకు చేరుకుంది. దీంతోపాటు స్వర్ణ ప్రాజెక్టు 6 వరద గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో వరద నీరు కూడా ఆలయం సమీపంలోకి వచ్చి చేరింది.

ఈ విషయాన్ని సదరు యువకులు గ్రామస్తులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో వారు స్పందించారు. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన సుంకరి, లక్ష్మన్న, గోనె రమేష్, మర్రి రాజేశ్వర్‌లు వరద నీటిని దాటి ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ చిక్కుకున్న ముగ్గురిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. సమాచారం తెలుసుకున్న ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, స్థానిక సర్పంచ్‌ రమేష్‌ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  

గ్రామస్తులు రక్షించారు
నెల రోజులుగా ఆలయంలో పనులు చేస్తున్నాం. బుధవారం నుంచి కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. దీంతో ఆలయం గర్భగుడిలో తలదాచుకున్నం. వరద క్రమేణా తగ్గుతుంది అనుకుంటే పెరగడంతో బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రాణాలతో బయటపడతామా అనుకున్నాం. చివరకు గ్రామస్తులు మమ్మల్ని రక్షించి ఒడ్డుకు చేర్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.      

– నాగేంద్ర, బాధితుడు   

మరిన్ని వార్తలు