భైంసాలో టెన్షన్‌.. టెన్షన్‌

23 Jul, 2021 08:14 IST|Sakshi
భైంసాలోని వినాయక్‌నగర్‌లో చుట్టూ నీరు చేరడంతో నీట మునిగిన ఇండ్లు, దుకాణాలు

సాక్షి, భైంసాటౌన్‌(నిర్మల్‌): గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదలడంతో దిగువన ఉన్న ప్రాంతాల్లో టెన్షన్‌ నెలకొంది. ఎగువప్రాంతాల్లో నుంచి భారీ ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు అధికారులు ఐదుగేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో ఆటోనగర్‌ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. భట్టిగల్లి పాక్షిక భాగం, వినాయక్‌నగర్, రాహుల్‌నగర్‌ వెనుకభాగం, గోకుల్‌నగర్‌ ప్రాంతాల్లోకి వరదనీరు చొచ్చుకువచ్చింది. ఆటోనగర్‌ ప్రాంతంలోని సామిల్‌లో బిహార్, మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలు వరదనీటిలో చిక్కుకున్నారు.

దాదాపు నాలుగు గంటల పాటు రెస్క్యూబృందాలతో సహాయక చర్యలు చేపట్టి వరదనీటిలో చిక్కుకున్న దాదాపు 150 మంది ప్రజలు, ఎన్‌ఆర్‌ గార్డెన్‌లో బస చేస్తున్న మరో 14 మందిని పోలీసులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రాహుల్‌నగర్‌ ప్రాంతంలో సైతం వాననీటికి ప్రధానకాల్వ పొంగి ప్రవహించింది. బస్‌డిపో ప్రాంతంలోని వైకుంఠధామం పూర్తిగా నీట మునిగింది. భట్టిగల్లిలోని హనుమాన్‌ పెద్ద విగ్రహం వరకు నీరు చేరింది. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఏఎస్పీ కిరణ్‌ఖారె, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు సహాయక చర్యలను పర్యవేక్షించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)  

మరిన్ని వార్తలు