Rainfall In Telangana: తెలంగాణలో భారీ వర్షం.. ఈదురు గాలుల బీభత్సం

4 May, 2022 07:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ​లోని పలు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వేసవి ఎండతాపంతో సతమతమవుతున్న ప్రజలకు ఈ భారీ వర్షం కొంత ఉపశమనం కలిగించనుంది. ఇక భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఈదురు గాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు.. అకాల వర్షంతో అన్నదాత మరోసారి ఆగమయ్యాడు. కోతల సమయంలో వర్షం పడటంతో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. 

ఇక హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌, జూబీహిల్స్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్‌, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బేగంపేట్‌, సైదాబాద్‌, చంపాపేట, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిం‍ది.  భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. పలు కాలనీలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్‌లోని సీతాఫల్మండిలో 7.2 సెంటీమీటర్లు, బన్సీలాల్‌పేట్‌లో 6.7 సె.మీ, వెస్ట్ మారేడ్‌పల్లిలో 6.1, అల్వాల్లో 5.9, ఎల్బీ నగర్‌లో 5.8, గోషామహల్ బాలానగర్‌లో  5.4, ఏఎస్ రావు నగర్‌లో 5.1, బేగంపేటలోని పాటిగడ్డలో 4.9, మల్కాజ్‌గిరిలో 4.7 పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు