కుమ్మేసిన వరణుడు.. హైదరాబాద్, వికారాబాద్‌ జిల్లాల్లో కుండపోత 

27 Jul, 2022 02:36 IST|Sakshi
ఔటర్‌ సబ్‌ రోడ్డుపై ప్రవహిస్తున్న వరదలో చిక్కుకున్న అరవింద్‌గౌడ్‌ను కాపాడుతున్న పోలీసులు

నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, రెండువందలకు పైగా బస్తీలు 

చెరువులను తలపించిన రహదారులు.. పొంగి పొర్లిన వాగులు  

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ గేట్లను తెరచిన అధికారులు 

కందవాడలో అత్యధికంగా 13.5 సెం.మీ. వర్షపాతం 

వికారాబాద్‌ జిల్లాలో నేడు ఇంటర్‌ మినహా విద్యాసంస్థలకు సెలవు

సాక్షి, హైదరాబాద్‌/వికారాబాద్‌/మొయినాబాద్‌: రాష్ట్ర రాజధానిని జడివానలు వీడటంలేదు. హైదరాబాద్‌తోపాటు వికారాబాద్‌ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. జనజీవనం అతలాకుతలమైంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా ఎడ తెరిపిలేకుండా కుంభవృష్టి కురియడంతో నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు, రెండువందలకు పైగా బస్తీలు పూర్తిగా నీటమునిగాయి. ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు పలు కాలనీలు, బస్తీలవాసులు నానా అవస్థలు పడ్డారు. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వరద నీరు పోటెత్తడంతో జంట జలాశయాలు, హుస్సేన్‌సాగర్‌ సహా పలు నాలాలు, చెరువులు, కుంటలు ఉప్పొంగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, జలమండలి అత్యవసర బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతున్నాయి.  

హిమాయత్‌సాగర్‌ ఆరు గేట్లు ఎత్తివేత 
భారీగా కురుస్తున్న వర్షాలకు ఈసీ వాగు ఉప్పొంగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండల పరిధిలోని వెంకటాపూర్, శ్రీరాంనగర్, అమ్డాపూర్, బాకారం, నాగిరెడ్డిగూడ గ్రామాల వద్ద వాగు ఉప్పొంగి పంటపొలాలన్నీ నీటమునిగాయి. చేవెళ్ల మండలం కందవాడలో 12.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హిమాయత్‌సాగర్‌ జలాశయంలోకి భారీగా వరద రావడంతో 6 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 3,910 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌ జలాశయంలో 10 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి 6,090 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.  
 
బైకర్‌ను కాపాడిన పోలీసులు 
రాజేంద్రనగర్‌: వికారాబాద్‌ జిల్లా బొమ్రాజ్‌పేట్‌ మండలం దూబ్‌చెర్ల గ్రామానికి చెందిన గౌనీ అరవింద్‌గౌడ్‌ (20) హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నాడు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో అరవింద్‌ కంచన్‌బాగ్‌లోని బాబాయ్‌ ఇంటికెళ్లి అక్కడే చదువుకునేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో తన బైక్‌పై పుస్తకాలు, ఒక కుర్చీ తీసుకుని అప్పా చౌరస్తా నుంచి హిమాయత్‌సాగర్, రాజేంద్రనగర్‌ మీదుగా వెళ్తున్నాడు. హిమాయత్‌సాగర్‌ గేట్లు తెరవడంతో ఔటర్‌ సబ్‌రోడ్‌పైనుంచి వరద ప్రవహిస్తోంది. బాబాయ్‌ ఇంటికి వెళ్లి చదువుకోవాలనే పట్టుదలతో ఉన్న అరవింద్‌ బైక్‌ను ముందుకుపోనిచ్చాడు.

వరద ఉధృతికి వాహనం రెయిలింగ్‌ వద్దకు కోట్టుకుపోగా దానిని పట్టుకుని, కాపాడాలంటూ వేడుకున్నాడు. 45 నిమిషాలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపిన అతడిని రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ బేగ్‌ తన సిబ్బందితో ట్రాఫిక్‌ వాహనాన్ని తెప్పించి వాహనంతోసహా అరవింద్‌ను కాపాడారు. తర్వాత అరవింద్‌కు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇస్తోంటే.. అతడు తడిచిపోయిన పుస్తకాలను సరిచేసుకుంటూ తనకు చదువే ముఖ్యంగా కనిపించిందని పోలీసులకు చెప్పాడు. అరవింద్‌ వరద నీటిలో చిక్కుకోవడంతో ఔటర్‌పై వెళ్తున్న వాహనాదారులతోపాటు స్థానికులు తమ సెల్‌ఫోన్‌లలో ఈ దృశ్యాన్ని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు