Telangana Rains: వానలు డబుల్‌! సాధారణంతో పోలిస్తే రెట్టింపు వర్షపాతం

12 Jul, 2022 01:22 IST|Sakshi
భద్రాచలంలో గోదావరి పోటెత్తడంతో కల్యాణకట్ట, ఆంజనేయస్వామి ఆలయంలోకి చేరిన నీరు

రాష్ట్రంలో సాధారణంతో పోలిస్తే రెట్టింపు వర్షపాతం నమోదు 

జూలై 11 నాటికి కురవాల్సింది 20.39 సెంటీమీటర్లు.. ఈసారి నమోదైనది 39.57 సెంటీమీటర్లు 

వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం 

మరింతగా బలపడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ 

మరో రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు 

మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని, పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. 
రెడ్‌ అలర్ట్‌: సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు..
ఆరెంజ్‌ అలర్ట్‌: నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ 
గద్వాల జిల్లాలకు..
ఎల్లో అలర్ట్‌: మిగతా జిల్లాలకు..
బలపడుతున్న అల్పపీడనం: దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని.. అది మరింత బలపడనుందని తెలిపింది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో.. తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 
కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు వెళ్తున్న వరద   

సాక్షి, హైదరాబాద్‌:  చురుకుగా కదులుతున్న నైరుతి రుతు పవనాలతో రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వానలు పడుతున్నాయి. సగటు సాధారణ వర్షపాతం కంటే రెండింతలు ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఏటా జూన్‌ ఒకటో తేదీ నుంచి నైరుతి సీజన్‌ మొదలై సెప్టెంబర్‌ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ నాలుగు నెలల కాలంలో సాధారణంగా అయితే 72.12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. ఇందులో జూలై 11వ తేదీనాటికి 20.39 సెంటీమీటర్లు కురవాలి. కానీ ఈసారి జూలై 11 నాటికే ఏకంగా 39.57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 94 శాతం అధికం కావడం గమనార్హం. వాస్తవానికి జూన్‌ నెలలో సాధారణం కంటే తక్కువ వాన పడింది. ఈ నెల ప్రారంభంలోనూ అలాగే ఉంది. కానీ గత వారం రోజుల్లోనే ఒక్కసారిగా పెరిగింది. లోటు భర్తీ కావడమేకాదు.. రెండింతల వాన నమోదై రికార్డు సృష్టించింది. 

29 జిల్లాల్లో అత్యధికంగా..:  వారం రోజులుగా కురుస్తున్న వానలతో రాష్ట్రంలో పలుచోట్ల చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పొలాల్లో నీళ్లు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యాయి. ఇందులో 29 జిల్లాల్లో అతి ఎక్కువ స్థాయిలో వానలు పడగా.. ఆదిలాబాద్, హైదరాబాద్, వికారాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాలు మాత్రమే కాస్త ఎక్కువ వానల జాబితాలో ఉన్నాయి. సొమవారం రాష్ట్రవ్యాప్తంగా సగటున 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

జల దిగ్బంధంలో ఏడుపాయల ఆలయం 
మెదక్‌ జిల్లాలో సింగూర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో వనదుర్గ ప్రాజెక్టు (ఘనపురం ఆనకట్ట) పొంగి పొర్లుతోంది. దీనితో ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం చుట్టూ నీళ్లు ప్రవహిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు