TS: రెండు రోజులు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

31 May, 2023 07:17 IST|Sakshi

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక 

పలు ప్రాంతాల్లో 42 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మిగతా ప్రాంతాల్లోనూ తేలికపాటి వానలు పడవచ్చని తెలిపింది. పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి దీనికి కారణమని వెల్లడించింది. మరోవైపు పలు ప్రాంతాల్లో మూడు రోజులపాటు 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. 

ఇటు వానలు.. అటు ఎండలు 
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వానలు పడగా.. మరికొన్ని చోట్ల ఎండలు మండిపోయాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి, మంచిర్యాల జిల్లా జన్నారంలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హనుమకొండ జిల్లా శాయంపేట, హసన్‌పర్తి, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, జైపూర్, జగిత్యాల జిల్లా పెగడపల్లి, కొమురంభీం జిల్లా సిర్పూరు, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, వరంగల్‌ జిల్లా ఆత్మకూర్, సంగెంలలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 

ఇక నిర్మల్‌ జిల్లా తానూరులో 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా భైంసా, ఆదిలాబాద్‌ జిల్లా పిప్పలధరిలలో 41.2, అర్లిలో 40.9 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బోమన్‌దేవిపల్లిలో 40.1, నిజామాబాద్‌ జిల్లా మాచిప్పలో 40, కల్‌దుర్కి, ఆదిలాబాద్‌ జిల్లా పొచ్చరలో 39.9, నిజామాబాద్‌లో 38.7, మెదక్‌లో 38.6, ఆదిలాబాద్‌లో 38.3, ఖమ్మంలో 36.2, హైదరాబాద్, రామగుండంలో 33.6 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  

ఇది కూడా చదవండి: డ్రైవింగ్‌లోనే గుండెపోటుకు గురై.. 

మరిన్ని వార్తలు