TS: ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. జాగ్రత్తలు తప్పనిసరి!

9 Jul, 2022 18:10 IST|Sakshi

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వాగులు వంకలు పొర్లిపొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల నేపథ్యంలో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లోని అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌, రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలకు అండగా నిలిచి అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ సూచించారు. సహాయక చర్యల్లో ప్రజలకు సాయపడుతూ నష్టం జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు.మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన రెవెన్యూ సదస్సులను వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ఉందని స్పష్టం చేశారు. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో ప్రజలు.. అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. 

మరిన్ని వార్తలు