హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌.. 8 గంటల పాటు భారీ వర్షాలు

15 Jul, 2021 07:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే 8 గంటల పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్‌ అలర్డ్‌ జారీ చేసింది. మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి సంగారెడ్డి, యాదాద్రి, మెదక్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించింది. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. బుధవారం రాత్రి ముసారాంబాగ్‌ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పటేల్‌నగర్‌, ప్రేమ్‌నగర్‌ కాలనీల్లో  డ్రైనేజీలు ఉప్పొంగాయి. రామంతాపూర్‌లో భారీ వర్షానికి ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయమయ్యాయి.

హైదరాబాద్‌లో భారీ వర్షపాతం నమోదైంది. ఉప్పల్‌లో అత్యధికంగా 21.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ 20, వనస్థలిపురం 19.2 సెం.మీ, హస్తినాపురం 19, పెద్ద అంబర్‌పేట్‌లో 18 సెం.మీ, సరూర్‌నగర్‌ 17.9, హయత్‌నగర్‌లో 17.2 సెం.మీ, రామంతాపూర్‌లో 17.1, హబ్సిగూడలో 16.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నీటమునిగిన ఎల్బీనగర్‌, ఉప్పల్ ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వలిగొండ మండలం పరిధిలో  ధర్మారెడ్డి పల్లి కాల్వ కు గండి పడింది.  తెలంగాణలోని నేడు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం  ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు