హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

14 Jun, 2021 07:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉదయం 5 గంటల నుంచి నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, చైతన్య పురి, కొత్తపెట్, సరూర్నగర్,  మీర్‌పేట్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో  వర్షం పడుతోంది. అంబర్‌పేట్‌, నాచారం, నల్లకుంట, ఓయూ, ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని పలుచోట్ల సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌ తీరం, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపోస్పియర్‌ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, మరో రెండు, మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వెళ్లే అవకాశం ఉందని వెల్లడించింది.

అదేవిధంగా అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ, ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వరకు 4.5 నుండి 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉత్తర పశ్చిమ ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల సోమ, మంగళవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. నల్లగొండ జిల్లా కనగల్‌లో 9.13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట్‌ జిల్లా దామరగిద్దలో 7.4 సెం.మీ., సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 6.6 సెం.మీ., సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 6.3 సెం.మీ.వర్షం కురిసింది.

కరీంనగర్: అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి ముసురులా వర్షం పడుతోంది.

చదవండి: కరోనా: బూస్టర్‌ డోస్‌లతో వేరియెంట్లకు చెక్‌

మరిన్ని వార్తలు