మళ్లీ జడివాన

9 Oct, 2021 04:29 IST|Sakshi
హైదరాబాద్‌ పాతబస్తీలో ఒకరికి ఒకరు తోడుగా రోడ్డు దాటుతున్న దృశ్యం

నిండా మునిగిన రాజధాని

జలమయమైన రహదారులు

ఇళ్లల్లోకి చేరిన వరద నీరు

పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్‌

రాత్రివేళ వణికించిన భారీ వర్షం

సాక్షి, సిటీబ్యూరో: ఉపరితల ఆవర్తనం ప్రభా వంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి పొద్దు పోయే వరకు కుండపోతగా జడి వాన కురిసింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో నగరం నిండా మునిగింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు చెరువు లను తలపించాయి. ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల చెట్ల కొమ్మలు తెగిపడ్డాయి. విద్యుత్‌ తీగలు తెగి పడడంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. పలు బస్తీలలో ఇళ్లల్లోకి చేరిన వరద నీటితో స్థానికులు అవస్థలు పడ్డారు.


రాంగోపాల్‌పేట నల్లగుట్టలో నీటమునిగిన కాలనీ 

ప్రధాన రహదారులపై రాత్రి 8 నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించింది. దిల్‌సుఖ్‌నగర్‌ పరిధిలోని లింగోజి గూడలో అత్యధికంగా 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాత్రి 9 గంటల వరకు కుర్మగూడలో 10, హస్తినాపురంలో 8.83, ఆస్మాన్‌ఘడ్‌ 8.75,  ఎల్బీనగర్‌ 8.58, కంచన్‌బాగ్‌ 8.40, చందూలాల్‌ బారాదరిలో 8.13, రెయిన్‌ బజార్‌ 7.73, జహానుమా 7.65, అత్తాపూర్‌ 6.90, రాజేంద్రనగర్‌ 6.68, మలక్‌పేట 6.43, మెహిదీపట్నంలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


చైతన్యపురి ప్రధాన రహదారిలో వర్షపు నీరు

మరిన్ని వార్తలు