బంగాళాఖాతంలో అల్పపీడనం

21 Sep, 2020 04:50 IST|Sakshi

నేడు మరింత బలపడే అవకాశం 

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు  

సాక్షి, హైదరాబాద్‌: ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారంనాటికి ఈ అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. సోమ, మంగళవారాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. 

రాజధానిలో కుండపోత 
నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు హైదరాబాద్‌ నగరం జలమయమైంది. ఆదివారం పలు ప్రాంతాల్లో 5–7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో వరద పోటెత్తింది. జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి వర్షపునీటిని బయటికి తోడిపోశాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరి న వర్షపునీటితో పలు బస్తీల వాసులు అవస్థలు పడుతున్నారు. ఇటు వికారాబాద్‌ జిల్లా లోనూ భారీ వర్షం కురిసింది. పెద్దేముల్‌ మం డలంలోని గాజీపూర్, కందనెల్లి, ఇందూరు వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. 

మరిన్ని వార్తలు