జల్లు..ఝల్లు

5 May, 2022 08:24 IST|Sakshi
బేగంపేటలో ప్రధాన రహదారిని ముంచెత్తిన వర్షపు నీరు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో బుధవారం తెల్లవారుజామున గాలి దుమారంతో కూడిన భారీ వర్షం దడ పుట్టించింది. నగర అధికార యంత్రాంగాన్ని హెచ్చరించింది. వర్షాకాలంలోగా ముంపు ముప్పు తప్పించేందుకు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించినప్పటికీ, చెప్పుకోదగిన స్థాయిలో పనులు జరగలేదు. దీంతో ముంపుముప్పు పొంచే ఉంది. గంటసేపు కురిసిన ఒక్కవానకే వాస్తవ పరిస్థితి కళ్లకు కట్టింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లు చెరువులను తలపించాయి. వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇళ్లపైకప్పులు లేచిపోయాయి. రోడ్లపై జనసంచారం లేని సమయం, సెలవు దినాలు కావడంతో తాత్కాలికంగా గండం  గట్టెక్కినప్పటికీ, వర్షాకాలంలో తలెత్తనున్న అసలు సినిమాకు టీజర్‌ రిలీజ్‌ అయిందని నగర ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. 

  • వరద సమస్యలకు పరిష్కారం చూపే నాలాల పనులు మందకొడిగా సాగుతున్నాయి. సీజన్‌లోగా ఇరవై శాతమే పూర్తికాగలవని అధికారులే చెబుతుండటంతో  ఈసారీ వాన కష్టాలు పునరావృతం కానున్నాయని తెలుస్తోంది. వర్షాలు కూడా తోడైతే పనులు జరిగే పరిస్థితే ఉండదు. ఈ నేపథ్యంలో, అధికారులు తక్షణ చర్యలకు సిద్ధం కావాల్సిన పరిస్థితిని ప్రకృతి హెచ్చరించింది. డీసిల్టింగ్‌ పనులు సైతం పూర్తికాకపోవడంతో వరద, డ్రైనేజీ కలగలసి పారిన చిత్రాలు కనిపించాయి. నాలాల పనులు పూర్తికానందున నీటినిల్వ ప్రాంతాలను గుర్తించి వెంటన తోడిపోయాల్సిన చర్యలు తప్పని పరిస్థితి నెలకొంది. 

ముప్పు.. తప్పేదెప్పుడు? 
నగరంలో వాన కురిసిందంటే చాలు ప్రధాన రహదారులే చెరువులుగా మారే రంగమహల్‌ జంక్షన్,  మైత్రీవనం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, విల్లామేరీ కాలేజ్, ఆర్‌పీ రోడ్, ఆలుగడ్డబావి, కార్ఖానా మెయిన్‌రోడ్, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, కేబీఆర్‌ పార్క్, మైలాన్‌షోరూమ్‌ (బంజారాహిల్స్‌), బయోలాజికల్‌ ఈ లిమిటెడ్,(రామ్‌నగర్‌), నిజాంకాలేజ్, ఖైరతాబాద్, అయోధ్య జంక్షన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ తదితర ప్రాంతాల్లో  సమస్యలు పరిష్కారం కాలేదు. కొత్తగా ఇతర ప్రదేశాలు నీటినిల్వ ప్రాంతాలుగా మారాయి.  

జరిగింది కొంతే.. జరగాల్సింది ఎంతో.. 

  • సమస్యల పరిష్కారానికి  నాలాల విస్తరణ, ఆధునికీకరణ తదితర పనులు మొదలు పెట్టినా, పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వివిధ ప్రాంతాల్లోని పనులే ఇందుకు నిదర్శనం.  
  • నాగమయ్యకుంట నాలా ఆధునికీకరణ పనులు 7 శాతం జరిగాయి. 
  • మోహిని చెరువు నుంచి మూసీ నది వరకు వరద కాల్వ పనులు 10 శాతం పూర్తయ్యాయి. యాప్రాల్‌లో నాగిరెడ్డిచెరువు–కాప్రాచెరువు వరదకాలువ పనులు 18 శాతం జరిగాయి.  మన్సూరాబాద్‌ చిన్నచెరువు–బండ్లగూడ చెరువు పనులు 7 శాతం జరిగాయి. బండ్లగూడ చెరువు–నాగోల్‌ చెరువు పనులు 20 శాతం పూర్తయ్యాయి. 
  • నూరినగర్‌ –డెక్కన్‌ ప్యాలెస్‌ వరకు 14 శాతం జరిగాయి. జల్‌పల్లి ఫిరంగి నాలా– క్యూబా కాలనీ వరకు  3 శాతం మాత్రమే  జరిగాయి. సాతం చెరువు నుంచి లంగర్‌హౌస్‌ (వయా మోతీ దర్వాజా) డ్రెయిన్‌ పనులు 10 శాతం జరిగాయి. నదీం కాలనీ నుంచి సాతం చెరువు వరకు పనులు 
  • 6 శాతం జరిగాయి. 
  • ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇతర ప్రాంతాల్లో వీటికి అటూఇటూగా పనులు జరిగాయి. 

ఫిర్యాదులెన్నో.. 
మధ్యాహ్నం  ఒంటిగంట వరకు జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌కు 48 ప్రాంతాల్లో చెట్లు కూలినట్లు ఫిర్యాదులందగా తొలగించినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ఇతర మాధ్యమాల ద్వారా నీటి నిల్వ లు, చెట్లు కూలిన ఫిర్యాదులందాయి. ఖైరతాబాద్‌ జోన్‌లో 71 ప్రాంతాల్లో, సికింద్రాబాద్‌ జోన్‌లో 54 ప్రాంతాల్లో,  చార్మినార్‌ జోన్‌లో 35 ప్రాంతాల్లో  నీటినిల్వలు తొలగించారు. ఖైరతాబాద్‌జోన్‌లో 42, సికింద్రాబాద్‌జోన్‌లో 7, చార్మి నార్‌ జోన్‌లో 3 కూలిన చెట్లను తొలగించారు.

వర్షాల సమస్యలపై  జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌రూమ్‌ 04021111111 లేదా 
04029555500 నెంబర్లకు ఫోన్‌ 
చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ పేర్కొంది. 

మరిన్ని వార్తలు