ముంచెత్తిన వాన

20 Sep, 2020 03:47 IST|Sakshi
జోగుళాంబ గద్వాల జిల్లా నందిన్నె వాగులో చిక్కుకున్న లారీ 

ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం  

జలమయమైన కాలనీలు, లోతట్టు ప్రాంతాలు  

ప్రమాదకరస్థాయిలో చిన్నేరువాగు, కాగ్నా నది 

దుందుబి వాగులో యువకుడి గల్లంతు 

తాడూరు మండలంలో గోడ కూలి చిన్నారి మృతి  

నందిన్నె వంతెన వద్ద వాగులో చిక్కుకున్న లారీ  

వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు 

అడ్డాకులలో అత్యధికంగా 20.8 సెం.మీ. వర్షపాతం నమోదు  

సాక్షి నెట్‌వర్క్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు అలుగు పోస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వర్ష బీభత్సంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అనేక చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలంలో అత్యధికంగా 20.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

గద్వాల, ధరూరు, మల్దకల్, మానవపాడు, కేటీదొడ్డి, ఇటిక్యాల ప్రాంతాల్లో పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాల్లో నడుము లోతు నీళ్లు రావడంతో ప్రజలు రాత్రంతా జాగరణ చేయాల్సి వచ్చింది. కేటీదొడ్డి మండలం గద్వాల–రాయిచూర్‌ రహదారిపై ఉన్న నందిన్నె  వాగులో ఓ లారీ  చిక్కుకుంది. అడ్డాకుల మండలం శాఖాపూర్‌ వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారిపై భారీ గండి పడింది. కల్వర్టు కింద ఉన్న మట్టి వరదకు కొట్టుకుపోవడంతో హైదరాబాద్‌ వైపు వెళ్లే రోడ్డు కోతకు గురైంది. ఇది గమనించిన కొందరు యువకులు వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అడ్డాకులలోని ఓ కోళ్ల ఫారంలో 9 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి.

జడ్చర్ల మండలం లింగంపేటకు చెందిన అఫ్రోజ్‌ (23) శనివారం ఈత కొట్టేందుకు దుందుబి వాగులోకి దూకాడు. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వాగులో కొట్టుకుపోయాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం భల్లాన్‌పల్లిలో పాతగోడ కూలి గుడిసెపై పడటంతో అందులో ఉన్న చిన్నారి పూజ (4) అక్కడికక్కడే మృతి చెందింది. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం జగ్గాయిపల్లిలో కుంట తెగి, వరద నీరు కోళ్లఫారంలోకి వెళ్లడంతో ఐదు వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. కాగా, కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ వెంకట్రావ్‌ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 08542–241165 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

ఇదిలాఉండగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. భూదాన్‌పోచంపల్లి –భీమనపల్లి గ్రామాల మధ్య చిన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. యాదాద్రి ఆలయానికి వెళ్లే దారి, రింగ్‌ రోడ్డు కోతకు గురయ్యాయి. నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం భీమనపల్లి నుంచి మాధాపురం వెళ్లే అంతర్గత రోడ్డు ధ్వంసమైంది. దేవరకొండ నియోజకవర్గంలో పంటచేలన్నీ నీట మునిగాయి. వరి, టమాటా, మిరప చేలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణ శివారులోని కాగ్నా నదికి వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. జంటుపల్లి  ప్రాజెక్టు అలుగు పారడంతో శివసాగర్‌ నిండుకుండలా మారింది. 

గోదావరికి వరద తాకిడి
ఎగువన ఎస్సార్‌ఎస్పీ గేట్లు ఎత్తడంతో గోదావరికి వరద తాకిడి పెరుగుతోంది. దీంతో శనివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంకాళేశ్వరం ప్రాజెక్టు పరిధి అన్నారం సరస్వతీ బ్యారేజీలోని 66 గేట్లకు 30 గేట్లు ఎత్తి నీటిని కాళేశ్వరం వైపునకు తరలిస్తున్నారు. ఇన్‌ఫ్లో 2,06,000 క్యూసెక్కులు ఉంది. అలాగే.. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీలో 88 గేట్లకు 46 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 3,06,470 క్యూసెక్కులు వస్తుండగా.. అవుట్‌ఫ్లో 2,76,100 క్యూసెక్కులు దిగువ గోదావరిలో కలుస్తున్నదని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. కాళేశ్వరం వద్ద గోదావరి 8.45 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది.  
గద్వాలలో వరదనీటి ప్రాంతాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

మరిన్ని వార్తలు