భారీ వర్షం: పులిచింతల బ్యాక్‌వాటర్‌తో ముంపు

14 Oct, 2020 10:55 IST|Sakshi

సాక్షి, నల్గొండ: ఎడతెరపి లేని వర్షంతో ఉమ్మడి నల్గొండ జిల్లా తడిసి ముద్దయింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు జిల్లా అంతటా వర్షం పడుతూనే ఉంది. భారీ వర్షంతో జన జీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లడం, చెరువులు అలుగుపడి పలు గ్రామాలకు రాకపోకలు నిలిపోయాయి.

కూలిన ట్రాన్స్‌ఫార్మరర్‌
మరోవైపు మూసీనది ఉగ్రరూపం దాల్చుతుంది. ఆ ప్రభావంతో భువనగిరి-నల్గొండ రహాదారిపై ఎక్కడిక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. రహదారి పక్కన పార్క్ చేసిన చిన్న చిన్న వాహనాలతో పాటు భారీ లారీలు కూడా వరదలో కొట్టుకుపోయాయి. అదృష్టవాత్తు వాహన డ్రైవర్లు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులో వరంగల్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై  విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ కూలిపోయింది. 

లోతట్టు ప్రాంతాలు జలమయం..
భారీ వర్షంతో సూర్యాపేట, కోదాడ పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూర్యాపేటలోని శ్రీరామ్‌నగర్, మానసనగర్, అంజనాపురి కాలనీ, బాలాజీనగర్, ఆర్‌కే గార్డెన్, ఎన్టీఆర్‌ కాలనీ, కుడకుడ, ఇందిరమ్మ కాలనీ, చింతల చెరువు, అదనపు 60ఫీట్ల రోడ్డు ప్రాంతాలను వర్షం ముంచెత్తి వరద చేరింది. కాలనీల్లో కూడా నీరు చేరుతుండడంతో మున్సిపల్‌ యంత్రాంగం జేసీబీలతో గండ్లు కొట్టించింది.  కోదాడ మండలం రెడ్లకుంట, అనంతగిరి మండలం శాంతినగర్‌లో రోడ్లవెంట చెట్టుకూలడంతో పోలీసులు తొలగించారు. కోదాడ పట్టణంలో భవానినగర్, శ్రీమన్నారాయణ కాలనీ,మాతానగర్, షిర్డీనగర్‌ కాలనీల్లోని ఇళ్ల చుట్టూ నీరు చేరింది. అలాగే మునగాల, నడిగూడెం మండల కేంద్రాల్లో కూడా వర్షపు నీళ్లు నిలిచాయి. ఇంకా ఒకటి, రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని ప్రభుత్వం హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలెవరూ లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని జిల్లా అధికారులు సూచనలు చేశారు. రోడ్లపై వాగులు ప్రవహించే చోట పోలీస్‌ యంత్రాంగం ముందస్తుగా ప్రమాదాలు జరగకుండా రాకపోకలను నిలిపింది. 

పులిచింతల బ్యాక్‌వాటర్‌తో ముంపు..
కృష్ణానది ఎగువ నుంచి భారీ వరద వస్తుండడంతో పులిచింతల నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 10గేట్లు ఎత్తి దిగువకు 3లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పై నుంచి వస్తున్న వరదతో చింతలపాలెం, మఠంపల్లి, పాలకవీడు మండలాల్లో కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పొలాలు బ్యాక్‌ వాటర్‌ ముంపులో పడ్డాయి. వరి, పత్తి చేనులు సుమారు 1500 ఎకరాలు నీటిలో మునిగాయి. చింతలపాలెం మండలంలోని ఎర్రవాగు, బుగ్గమాదారం, వజినేపల్లి వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మండలంలోని 6 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తుంగతుర్తి మండలలోని సంగెం, వెలుగుపల్లి గ్రామాల వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుమలగిరి మున్సిపాటిటీ కేంద్రంలో తొర్రూరు రోడ్డువైపు ఉన్న పెద్దచెట్టుకూలి విద్యుత్‌ తీగలపై పడటంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అర్వపల్లి మండలంలోని తిమ్మాపురం సంగెం వద్ద రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. నాగారం మండలంలో ఒక ఇల్లు కూలింది. 

ఎడతెరిపిలేని వర్షం
యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో నిన్నటి నుండి వర్షం కురుస్తుంది. వర్షానికి రోడ్లులు అన్ని జలమయమయ్యాయి. నియోజకవర్గం వ్యాప్తంగా చెరువులు,కుంటల్లో జల కళ సంతరించుకుంది. వాగులు అన్ని నీటి ప్రవాహం తో కనిపిస్తున్నాయి. పలు చోట్ల వాగుల్లో నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో రోడ్డు పై నుండి నీరు ప్రవహిస్తుంది. మరోవైపు ఆలేరు పట్టణ కేంద్రంలోని బీసీ కాలనీ వార్డులు జలమయం అయ్యాయి కురుస్తున్న వర్షానికి రోడ్లు అన్ని జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటంతో రాజపేట పట్టణ కేంద్రంలో రోడ్డు చెరువును తలపిస్తుంది. రోడ్డు పై వర్షం నీరు అధికంగా ప్రవహిస్తుండటం తో రాకపోకలకు అంతరాయం కలగకుండా దారి మళ్లిస్తున్నారు. యాదగిరిగుట్ట నుండి తుర్కపల్లి ఈసీఎల్ కు నిర్మిస్తున్న నాలుగు లైన్ల రోడ్డు దత్తాయ పల్లి వెంకటాపురం మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు వరద ప్రవాహంతో కొట్టుకుపోవడంతో తుర్కపల్లి యాదగిరిగుట్ట మధ్య రాక పోకలు బంద్ అయ్యాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు