హైదరాబాద్‌లో కుండపోత వర్షం

9 Oct, 2020 21:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, షేక్‌పేట, టోలిచౌకి, ఎస్సార్‌ నగర్‌, ముషీరాబాద్‌,గాంధీనగర్‌, చిక్కడపల్లి, రాంనగర్‌, అబిడ్స్‌, అఫ్జల్‌గంజ్‌, కోఠి,పురానాపూల్‌, రాజేంద్ర నగర్‌,అత్తాపూర్‌, నార్సింగి, మణికొండ, అంబర్‌పేట, నల్లకుంట, నాచారం, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. చాలా ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం దంచికొడుతోంది. దీంతో  పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌తో సహా తెలంగాణవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, సిద్దిపేట, జనగామ, వరంగల్(పట్టణ మరియు గ్రామీణ) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి,   మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో ఇవాళ, రేపు ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు,మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

  • అసిఫ్ నగర్ లో 7.1 సెంటిమీటర్లు..
  • ఖైరతాబాద్ లో 5.5 సెంటిమీటర్లు..
  • జూబ్లీహిల్స్ లో 4.9 సెంటిమీటర్లు..
  • మెహదీపట్నం లో 3.4 సెంటిమీటర్లు..
  • కార్వాన్ లో 3.3 సెంటిమీటర్లు..
  • బేగంపెట్ లో 1.7 సెంటిమీటర్లు
  • గోషామహల్ లో 1.3 సెంటిమీటర్లు..
  • సికింద్రాబాద్ లో 1.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు..

ఇక అల్పపీడనం రాగల 24 గంటలలో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్  తీరంలో అక్టోబరు 12 ఉదయం వాయుగుండం​గా తీరాన్ని దాటే అవకాశం ఉంది. రాయలసీమ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో 1.5కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే రాయలసీమ ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు