కాలనీలు.. కన్నీళ్లు

6 Sep, 2021 03:11 IST|Sakshi
చౌటుప్పల్‌లో నీట మునిగిన చిన్నకొండూర్‌ రోడ్డు

ఏకధాటి వానతో కకావికలం 

పలు కాలనీల్లో నడుములోతున చేరిన నీరు 

గోదారులైన పట్టణాల్లోని ప్రధాన రహదారులు 

నిండామునిగిన మహబూబ్‌నగర్, కరీంనగర్, సిరిసిల్ల, చౌటుప్పల్‌ 

వేర్వేరుచోట్ల వరదనీటిలో కొట్టుకుపోయిన ఇద్దరు 

 సాక్షి, నెట్‌వర్క్‌: కుండపోత వానకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఏకధాటి వర్షం మహబూబ్‌నగర్, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్‌ జిల్లాలను కకావిలకం చేసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, ఆయా కాలనీల్లోని ప్రజలు రాత్రంతా కంటిమీద కునుకులేకుండా గడిపారు. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో వరద నీటిలో పడి ఇద్దరు కొట్టుకుపోగా, ఒకరి మృతదేహం లభ్యమైంది.  

మహబూబ్‌నగర్‌ పట్టణం రామయ్యబౌలిలో ఇళ్ల మధ్యే నిలిచిన వర్షపు నీరు  

పాలమూరు కకావికలం 
శనివారం అర్ధరాత్రి మొదలై.. ఆదివారం ఉదయం వరకు కురిసిన వానతో మహబూబ్‌నగర్‌ జిల్లా అల్లాడింది. ఒక్క మహబూబ్‌నగర్‌ పట్టణంలోనే 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్, జడ్చర్ల పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు అలుగు పారడంతో దిగువన ఉన్న ఏడు కాలనీల్లోని ఇళ్లలోకి నడుము లోతున నీళ్లు చేరాయి. అర్ధరాత్రి వేళ నీటమునిగిన ఇళ్లలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్, ఎస్పీ వెంకటేశ్వర్లు  లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పెద్దచెరువు అలుగు పారడంతో మినీ ట్యాంక్‌బండ్‌ మీదుగా రాకపోకలను అధికారులు నిలిపివేయించారు. అడ్డాకుల మండలంలోని వర్నె వద్ద మట్టిరోడ్డు వాగులో కొట్టుకుపోయింది. ఈ వర్షంతో మొక్కజొన్న, కంది, పత్తి పంటలకు నష్టమేనని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 
 
నారాయణపేట జిల్లా ఊట్కూర్‌లో అలుగు పారుతున్న పెద్దచెరువు   

 ఉమ్మడి కరీంనగర్‌ను కుమ్మేసింది.. 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీవర్షం కురిసింది. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లోని శివారు కాలనీలు జలమయమయ్యాయి. కరీంనగర్‌లోని పలు కాలనీలు నీటమునగగా, ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. విపత్తుల బృందం రంగంలోకి దిగి డ్రైనేజీల్లో నిండిన నీటిని దారిమళ్లించింది. పద్మానగర్‌లోని వాల్‌మార్ట్‌ వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. వాహనాల రాకపోకలు స్తంభించాయి. సిరిసిల్లలోని బీవైనగర్, అనంతనగర్‌లోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. కొత్తచెరువు మత్తడి దూకడంతో ఆటోనగర్, శాంతినగర్, ఆసిఫ్‌పుర, రాళ్లబావి ప్రాంతాలు జలమయమయ్యాయి. తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రహరీ కూలిపోయింది. గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువమానేరు ఉధృతంగా మత్తడి పోస్తుండటంతో సిద్దిపేట–కామారెడ్డి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. 

కొట్టుకుపోయిన ఇద్దరు.. 
వికారాబాద్‌ జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. జిల్లాలో సగటున 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోమిన్‌పేట్‌ మండలంలో అత్యధికంగా 104.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగ్నా నదిలో వరద ఉధృతికి యువకుడు కొట్టుకుపోయాడు. ధారూరు మండలం దోర్నాల్‌కి చెందిన గోరయ్య (35) పీర్ల పండుగలో డప్పులు వాయించేందుకు శనివారం రాత్రి వెళ్లాడు. ఆదివారం ఉదయం తిరిగి వస్తున్న క్రమంలో నదిదాటుతూ  కొట్టుకుపోయాడు. రెండు కిలోమీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది. కాగా, సంగారెడ్డి జిల్లా రేజింతల్‌ గ్రామ శివారులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఆదివారం ఉదయం ఓ వ్యక్తి ఝరాసంగం వైపు నుంచి రేజింతల్‌ వైపు బైక్‌పై వస్తున్న క్రమంలో కల్వర్టు దాటుతూ ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు హద్నూరు పోలీసులు చెప్పారు. 

జల దిగ్బంధంలో చౌటుప్పల్‌ 
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణం జలమయమైంది. శనివారం రాత్రి కురిసిన వర్షంతో ఊర చెరువులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరి.. ఆదివారం ఉదయం నుంచి అలుగు పారింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్, గాంధీపార్క్, సెల్లార్‌ దుకాణాలు, పలు కాలనీలను నీరు ముంచెత్తింది. పోలీస్‌ స్టేషన్‌లోకి సైతం నీరు చేరింది. బస్‌స్టేషన్, హాండ్లూమ్‌ మార్కెట్, గాంధీపార్క్, విద్యానగర్, శాంతినగర్, రాంనగర్, వినాయకనగర్‌ ప్రాంతాలపై  ప్రభావం ఎక్కువగా పడింది. చిన్నకొండూర్‌ రోడ్డు వరకు సర్వీస్‌ రహదారి వెంట వరద నీరు పోటెత్తింది. వరద సాఫీగా వెళ్లేందుకు అనువైన కాలువలు లేకపోవడం, సర్వీస్‌ రోడ్డు వెంట ఉన్న కాలువ సరిపోకపోవడంతో నీరు చుట్టుపక్కల కాలనీలను ముంచెత్తింది.  

మరిన్ని వార్తలు