TS: రోడ్లన్నీ జలదారులే

8 Sep, 2021 01:41 IST|Sakshi
కరీంనగర్‌ నుంచి జగిత్యాల వెళ్లే హైవే పూర్తిగా నీటమునిగింది. వరద తీవ్రతకు చాలా కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. మంగళవారం కరీంనగర్‌లోని ఆర్టీసీ వర్క్‌షాప్‌ ప్రాంతంలో జలమయమైన రోడ్డుపైనే వెళ్తున్న ఆర్టీసీ బస్సు

20 జిల్లాలను ముంచెత్తిన వర్షాలు  10 మంది మృతి.. ఇద్దరు గల్లంతు

వరంగల్‌ జిల్లా నడికుడలో 38.8 సెం.మీ. కుంభవృష్టి 

జాతీయ రహదారులు సహా రోడ్లన్నీ జలమయం 

గ్రామాలు జల దిగ్బంధం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఆగమాగం

సిరిసిల్లలో పరిస్థితిని స్వయంగా సమీక్షించిన మంత్రి కేటీఆర్‌ 

సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు

మరో మూడు రోజులు వానలు 

ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే రుతు పవనాలు కూడా చురుగ్గా ఉండటం, ఈనెల 11న ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండటంతో.. వానలు మరికొద్దిరోజులు కొనసాగవచ్చని వెల్లడించింది.  

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌:రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కారణంగా జన జీవనం అతలాకుతలమైంది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చాలా పట్టణాలు, గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు వరంగల్‌ జిల్లా నడికుడలో ఏకంగా 38.8 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇంతస్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే మొదటిసారని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్‌ జిల్లా మల్యాలలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వెల్లడించింది. ఈ రెండు చోట్ల మాత్రమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 జిల్లాల్లో భారీ వర్షాలు నమోదైనట్టు తెలిపింది. 

భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా అతలాకుతలమైంది. మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం హన్మకొండలోని హంటర్‌ రోడ్డు జంక్షన్‌ను ముంచెత్తిన వరద

జల దిగ్బంధంలో వరంగల్‌.. 
భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా అతలాకుతలమైంది. వాగులు ఉప్పొంగి భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం జంపన్నవాగు బ్రిడ్జికి ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. వరంగల్‌లో ముంపు బాధితులను పునరావాస కేం ద్రాలకు తరలిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లోకి వరద చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై భారీ వరద చేరడంతో పంతిని వద్ద ప్రవాహంలో ఓ లారీ చిక్కుకుంది. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో పంటలు నీటమునిగాయి.

వేములవాడ శివారు లక్ష్మీపూర్‌కు చెందిన మూడు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, గ్రామస్తులు  
అన్ని చోట్లా బీభత్సమే.. 
 ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. జోగిపేట అన్నసాగర్, నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని నల్లవాగు, జహీరాబాద్‌ నియోజకవర్గంలోని నారింజ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది.  
► నిజామాబాద్‌ నగరంలో పలు లోతట్టు కాలనీలు నీటమునిగాయి. దీంతో కంఠేశ్వర్‌ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై ఆయా కాలనీల జనం ధర్నా చేశారు. ఉమ్మడి జిల్లా జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి, సోయా, పసుపు, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా సోయా పంటకు నష్టం ఎక్కువగా జరిగినట్లు అంచనా. పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. 
► యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆలేరు–సిద్దిపేట మార్గంలోని కొలనుపాక, రాజాపేట మండల కేంద్రం జల దిగ్బంధం అయ్యాయి. భారీ వర్షాలతో యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 
► నిర్మల్‌ జిల్లాలో గోదావరి నది, ఉప నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భైంసా పట్టణంలో 9 కాలనీలు నీటమునిగాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కుంటాల, పొచ్చర జలపాతాలు హోరెత్తుతున్నాయి. బోథ్‌ తహసీల్దార్‌ కార్యాలయం పైకప్పు పెచ్చులూడిపడ్డాయి. 


పది మంది మృతి.. ఇద్దరు గల్లంతు 
► సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి–గూడాటిపల్లి మధ్య వాగు దాటుతూ. పోతారం(జే) గ్రామానికి చెందిన రంగు కిష్టస్వామి (45) చనిపోయారు. 
► సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం మాద్వార్‌కు చెందిన కోవూరి మహిపాల్‌ (35) మంగళవారం మధ్యాహ్నం కిరాణా సరుకులు తీసుకొని ఇంటికి వస్తుండగా.. గ్రామ శివార్లలోని కాజ్‌వే దాటుతూ వాగులో కొట్టుకుపోయి మృతి చెందారు. 
► ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట బస్టాండ్‌లో అనాథ వ్యక్తి వానకు తడిసి, చలి తట్టుకోలేక మృతి చెందారు.


కోరుట్లలో నీట మునిగిన ప్రకాశం రోడ్‌ ప్రాంతం 
► జగిత్యాల జిల్లాలో వాన నలుగురిని బలితీసుకుంది. గొల్లపెల్లి మండలం మల్లన్నపేట వద్ద బైక్‌పై కాజ్‌వే దాటుతూ.. నందిపల్లెకు చెందిన ఎక్కలదేవి గంగమల్లు, ఆయన కుమారుడు వరదలో కొట్టుకుపోయి చనిపోయారు. మల్లాపూర్‌ మండలంలో ఇంట్లో మోటార్‌ వేద్దామని వెళ్లిన నేరెల్ల శ్రీను అనే వ్యక్తి.. వైర్లు తడిసి ఉండటంతో విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందారు. గొల్లపల్లి మండలం బొంకూర్‌లో ఓ అంగన్‌వాడీ టీచర్‌ తడిసిన వైర్లను ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి బలయ్యారు. 
► సిరిసిల్ల పట్టణంలో వరదలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. కానీ అప్పటికే అతను చనిపోయి ఉన్నట్టు గుర్తించారు.


వరద తాకిడికి మూలవాగుపై నిర్మిస్తున్న వంతెన కూలిపోయిన దృశ్యం 
► కామారెడ్డి జిల్లా గర్గుల్‌ గ్రామంలో వానకు తడిసి ఇంటిగోడ కూలడంతో.. నిమ్మ నర్సవ్వ (35) అనే మహిళ చనిపోగా, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే జిల్లా బాన్సువాడ మండలం కన్నయ్యతండాలో ఆశ్రద్‌ (38) అనే రైతు పొలం వద్ద విద్యుత్‌ షాక్‌ తగిలి ప్రాణాలు కోల్పోయారు. 
► నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి) మండలంలో టెంబరేణి దగ్గర ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌లో చేపలవేటకు వెళ్లి గుమ్ముల నరేశ్‌ (36), కరీంనగర్‌ మండలం చెర్లబుత్కూర్‌లో వాగు దాటుతూ ఓ వ్యక్తి గల్లంతయ్యారు. 

గర్భిణులకు వరద కష్టాలు

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొత్త వెంకటగిరి– బిల్లుపాడు గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వెంకటగిరికి చెందిన కిన్నెర మమత పురిటినొప్పులతో బాధ పడుతుండగా.. వాగు ప్రవాహం నుంచే నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా..ఆడపిల్లకు జన్మనిచ్చింది.

► ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం చిన్నుమియ తండాకు చెందిన గర్భిణి గంగాబాయికి మంగళవారం ఉదయం పురిటినొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి 108 వచ్చే అవకాశం లేకపోవడంతో.. సమీపంలోని గుట్ట మీదుగా కిలోమీటర్‌ దూరం నడిపించుకుంటూ తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి 108లో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు