Telangana Weather: గోదారమ్మ ఉగ్రరూపం.. తీవ్ర హెచ్చరికలు! కడెం, భద్రాచలం దగ్గర హైటెన్షన్‌

13 Jul, 2022 19:33 IST|Sakshi

సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు గోదావరి, ప్రాణహిత ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల పుష్కర ఘాట్ల పైనుంచి గోదావరి నీరు ప్రవహిస్తోంది. భద్రాచలంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఉత్తర తెలంగాణకు మళ్లీ భారీ వర్ష సూచనలతో అధికారులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది.

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. మొత్తం పదకొండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, మహబూబాబాద్‌, జనగామ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో భారీ వానలు ఉండొచ్చని తెలిపింది.   

మరోవైపు  గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకోవైపు భద్రాచలం వద్ద కూడా గోదావరి ఉధృతి కొనసాగుతోంది. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్టు చేస్తున్నారు అధికారులు. సుమారు 55 అడుగులకు చేరింది నీటి మట్టం. ఎగువ నుంచి గోదావరిలోని 20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అర్ధరాత్రి లోగా 63 అడుగులకు చేరొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఏ క్షణం పరిస్థితి ఎలా మారుతుందో తెలియక అధికారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం భద్రాచలంలోనే ఉంది. మంత్రి పువ్వాడ అజయ్‌ భద్రాచలంలోనే బస చేసి పరిస్థితి సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తక్షణ సహాయక చర్యల నిమిత్తం హెలికాప్టర్ సిద్ధం చేశారు. 

పర్యాటకం బంద్‌
నాన్‌ స్టాప్‌గా కురుస్తున్న వానలకు తెలంగాణలో పర్యాటకం బంద్‌ అయ్యింది. ఓరుగల్లుతో పాటు పలు ప్రాంతాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

ముప్పు ముంగిట కడెం
తెలంగాణలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షంతో పాటు ఎగువ నుంచి నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో ప్రాజెక్టు నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.  కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు.  ప్రస్తుతం 17 గేట్లు ఎత్తి అధికారులు రెండు లక్షల 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అయినా అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు ఎక్కువ ఉండడంతో ప్రాజెక్టు కట్ట పైనుంచి నీరు ప్రవహిస్తుంది.

వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దాంతో, కడెం ప్రాజెక్టు వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు,  ప్రాజెక్టు పరిధిలోని 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్, జిల్లా ఎస్పీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరిన్ని వార్తలు