Telangana Rains: మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ

11 Jul, 2022 09:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే చెరువులు, కుంటలు అలుగెత్తి ప్రవహిస్తుండగా... మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉండడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలోని సముద్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది.

ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉందని, ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొము­రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించింది.  


భూపాలపల్లి జిల్లా పెద్దంపేట వాగుపై కోతకు గురైన వంతెన రోడ్డు  

28 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం..: శుక్రవారం నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 6.01 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 14.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలోని ముత్తారం మహదేవ్‌పూర్‌లో 31.03 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.  


ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం మేడారంలో జంపన్నవాగు బ్రిడ్జిపైనుంచి ప్రవహిస్తున్న వరద

నైరుతి రుతుపవనాల సీజన్‌లో జూలై 10వ తేదీ సాయంత్రానికి 19.79 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా..ఏకంగా 36.59 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ పేర్కొంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే 85 శాతం అధికంగా వర్షాలు కురవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 5 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు ప్రణాళిక శాఖ వెల్లడించింది.

మరిన్ని వార్తలు