Hyderabad Rains: మళ్లీ కుమ్మేసిన వాన.. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు

5 Sep, 2021 07:52 IST|Sakshi
మూసారంబాగ్‌ మూసీ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వర్షపు నీరు

లోతట్టు ప్రాంతాలు జలమయం

చెరువుల్ని తలపించిన రహదారులు

నీట మునిగిన మూసారంబాగ్‌ వంతెన

నిలిచిపోయిన రాకపోకలు

పలు కూడళ్లలో గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌

మలక్‌పేటలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఐదు అంబులెన్స్‌లు

వరదనీటిలో కొట్టుకుపోయిన వాహనాలు

ట్రిప్పైన ఫీడర్లు.. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

సైదాబాద్‌లో అత్యధికంగా 10.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు

రోజంతా ఏకధాటిగా కురిసిన వర్షానికి శనివారం నగరంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. మూసారంబాగ్, మలక్‌పేట్‌లో ఇంటి ముందు పార్క్‌ చేసిన వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను ఆస్పత్రులకు తరలించే 108 వాహనాలు సహా ప్రైవేటు అంబులెన్స్‌లు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి.  మొత్తంగా శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వానతో నగరం అతలాకుతలమైంది
-సాక్షి, హైదరాబాద్‌

 ట్రాఫిక్‌ స్తంభన..
రోడ్లపైకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో కొత్తపేట్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్‌ రైల్వేబ్రిడ్జీ, జూబ్లీహిల్స్, పంజగుట్ట, అమీర్‌పేట్, మూసాపేట్, సికింద్రాబాద్, బేగంపేట్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, చంపాపేట్, చాంద్రాయణగుట్ట, మోహిదీపట్నం, అత్తాపూర్, బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ వన్, మాసాబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, ఆరీ్టసీక్రాస్‌ రోడ్డు, అంబర్‌పేట్, రామంతాపూర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  
చదవండి: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. ఎవరూ బయటకు రావొద్దు!


సుందరయ్య విజ్ఙాన్‌ కేంద్రం వద్ద

అంబులెన్స్‌ల్లో అవస్థ 
మలక్‌పేటలోని లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. వరదనీటి కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌జాం అయింది. రోగులను ఆస్పత్రులకు తరలిస్తున్న ఐదు అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు నానా తంటాలు పడి అంబులెన్స్‌లకు దారి చూపించాల్సి వచి్చంది. అక్బర్‌బాగ్, ఓల్డ్‌ మలక్‌పేట్, మున్సిపల్‌ కాలనీ, పద్మనగర్, కాలడేర, మలక్‌పేట్‌ రైల్వే బిడ్జి, అజంపుర, సైదాబాద్, సరూర్‌నగర్, ఆర్‌కేపురం, ఐఎస్‌సదన్‌ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. 

కరెంట్‌ కట్‌ 
వర్షం, వరదల కారణంగా చెట్లకొమ్మలు విరిగిలైన్లపై పడటంతో మెట్రో జోన్‌లో 42, రంగారెడ్డి జోన్‌లో 34 ఫీడర్లు ట్రిప్పై విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల సరఫరాను వెంటనే పునరుద్ధరించినప్పటికీ..మరికొన్ని చోట్ల అర్థరాత్రి తర్వాత కూడా కరెంట్‌ రాలేదు. ఇంట్లో లైట్లు వెలుగక, ఫ్యాన్లు తిరగక దోమలు కంటిమీద కునుకులేకుండా చేశాయి. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు ఫోన్‌ చేస్తే ..వారి ఫోన్లు మూగబోయి ఉండటంతో సిటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

  
మలక్‌పేట్‌ మూసారంబాగ్‌లో వరదనీటిలో కొట్టుకు పోతున్న కారు 

నిండుకుండల్లా చెరువులు 
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, తుర్కయాంజాల్‌ చెరువు సహా రామంతాపూర్‌ చెరువులు నిండుకుండలను తలపించాయి. ఎగువ నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు వాటి గేట్లు తెరిచి కిందికి నీటిని విడుదల చేశారు. ఫలితంగా మూసీ పరివాహక ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. అంబర్‌పేట నుంచి మూసారంబాగ్‌ మధ్యలో ఉన్న వంతెనపై నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా ఆయా ప్రాంతాలకు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరివాహాక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  


పీ అండ్‌ టీ కాలనీ సీసల బస్తీలో

జంట జలాశయాలకు భారీగా వరద 
సాక్షి, సిటీబ్యూరో/మణికొండ: గత నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసీ సహా ఈసీ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు వరదనీరు పోటెత్తుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.   
►హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1761.75 అడుగుల మేర నీరు చేరింది. మొత్తం 17 గేట్లు ఉండగా 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌ సాగర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1790.00 అడుగులు కాగా..ప్రస్తుతం 1789.00 అడుగుల మేర నీరు చేరింది. మొత్తం గేట్ల సంఖ్య 15 గేట్లు కాగా 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 


మలక్‌పేట్‌లో

రాగల 48 గంటల్లో భారీ వర్షాలు 
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా శనివారం సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు సైదాబాద్‌లో అత్యధికంగా 10.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఆస్మాన్‌ఘడ్‌లో 9.2, మలక్‌పేటలో 7.6, విరాట్‌నగర్‌లో 6.5, ఐఎస్‌సదన్‌లో 6.3, రెయిన్‌బజార్‌లో 5.5, కంచన్‌బాగ్‌లో 5.4, కాచిగూడలో 5.0, ఉప్పల్‌ మారుతినగర్‌లో 4.6, మచ్చ»ొల్లారంలో 4.5, చర్లపల్లి, సర్దార్‌ మహల్‌ 4.3, బతుకమ్మకుంటలో 4.1, డబీర్‌పురలో 4.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 48 గంటల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది.  


మలక్‌పేట్‌ ప్రధాన రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు

ఎక్కడ ఏమైందంటే...? 
►సరూర్‌ నగర్‌లోని సీసలబస్తీ, కమలానగర్, కోదండరాంనగర్, శారదానగర్, ఎస్‌సీ హాస్టల్‌ రోడ్డు, పీఅండ్‌టీ కాలనీలలోని రోడ్లపై మోకాళ్ల లోతు నీరు ప్రవహించింది.  
►కర్మన్‌ఘాట్‌ ప్రధాన రోడ్డులో పార్కు చేసిన వాహనాలు నీటిలో మునిగిపోయాయి. దిల్‌సుఖ్‌నగర్‌–ఎల్‌బీనగర్‌ వెళ్లే జాతీయ రహదారి చైతన్యపురి చౌరస్తాలోని వైభవ్‌ టిఫిన్‌ సెంటర్‌ రోడ్డులో మూడు అడుగుల మేర వరదనీరు ప్రవహించింది. 
►గడ్డిఅన్నారంలోని శివగంగా థియేటర్‌ రోడ్డులో వాన నీటితో నిండిపోవటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.   
►బాలాపూర్‌ మండలంలోని ఉస్మాన్‌ నగర్, ఆర్‌కేపురం యాదవనగర్, అల్కాపురి, ఎన్‌టీఆర్‌నగర్, తీగలగూడ, అజంపురలోని కాలనీలు, సింగరేణి కాలనీ, మీర్‌పేట్‌ లెనిన్‌నగర్, ఆర్‌సీఐ రోడ్డు, జిల్లెలగూడలోని శ్రీధర్‌నగర్, సత్యనగర్, మిథిలానగర్‌ తదితర కాలనీలు ముంపునకు గురయ్యాయి. 


దిల్‌సుఖ్‌నగర్‌ శివగంగ  థియేటర్‌ రోడ్డులో

►అంబర్‌పేటలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పటేల్‌నగర్, అలీ కేఫ్, గోల్నాక తదితర ప్రాంతాలకు వర్షపునీరు భారీగా వచ్చి చేరింది. భారీగా ఇళ్లల్లోకి వర్షపునీరు చేరింది. అలీకేఫ్‌ వద్ద, మూసీ బ్రిడ్జిపై వరదనీరు పొంగి పొర్లింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  
► చార్మినార్‌ సర్దార్‌ మహల్‌ రోడ్డు నుంచి కోట్లా ఆలిజా రోడ్డు వైపు గల ప్రధాన రోడ్డులోని డ్రైనేజీ పొంగి మురుగునీరు వరదనీటితో కలిసిపోయింది. మోకాలు లోతు వరకు రోడ్డుపై వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.   


చిక్కడపల్లిలో

►రాజ్‌భవన్, సోమాజిగూడ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ సమీప ప్రాంతాల్లో వరద నీటి కాల్వ మ్యాన్‌హోళ్లు నోళ్లు తెరుచుకుని ప్రమాదకరంగా మారాయి. చింతల్‌బస్తీ, ఫిలింనగర్, కమలాపురి కాలనీ, సయ్యద్‌నగర్, ఫస్ట్‌లాన్సర్, ఉదయ్‌నగర్, సింగాడికుంట, శ్రీరాం నగర్, అంబేద్కర్‌నగర్, మక్తా, పోచమ్మ బస్తీ, అమీర్‌పేట్‌ మార్కెట్, పంజగుట్ట మోడల్‌హౌజ్‌ తదితర ప్రాంతాల ప్రజలు మురుగునీటితో అవస్థలు పడుతున్నారు. 
►సుందరయ్య విజ్ఞానకేంద్రం ప్రాంతం చెరువును తలపించింది. మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో అక్కడ పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాలు, కార్లు నీటమునిగాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు