తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్‌, ఏపీలో పిడుగులతో భారీ వర్షాలు.. భారీ వర్షాలు ఇంకా ఎన్నిరోజులంటే..

1 May, 2023 07:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/అమరావతి:  తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడడం లేదు. తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు సోమవారం ఉదయం నుంచి ఇరు రాష్ట్రాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కూడా.  

తెలంగాణలో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అలాగే పలు జిల్లాలకు యెల్లో అలర్ట్‌ జారీ అయ్యింది. భారీ వానలు, వడగండ్ల వానలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజధాని హైదరాబాద్‌లోనూ భారీ వాన సూచన మేరకు అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేస్తోంది.

యెల్లో అలర్ట్‌ జారీ అయిన జిల్లాలు.. 

  • ఉమ్మడి ఆదిలాబాద్‌ పరిధిలోని.. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల,నిర్మల్‌. 
  • నిజామాబాద్‌
  • కరీంనగర్‌తో పాటు పెద్దపల్లి 
  • సూర్యాపేట, 
  • మహబూబ్‌నగర్‌తో పాటు నాగర్‌కర్నూల్‌, నారాయణపేట

రాబోయే రెండు మూడు రోజుల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో. అలాగే.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.

అమరావతి: ఇక ఏపీలో నేడు(సోమవారం), రేపు(మంగళవారం) అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలో.. సోమవారం ఉదయం నుంచి పలుచోట్ల వర్షం పడుతోంది. విజయవాడ, ఏలూరులో ఓ మోస్తరు వర్షం కురుస్తుండగా.. పలు జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది.  ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది వాతావరణ కేంద్రం.

అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా పంట నష్టం వాటిల్లగా.. మరోవైపు జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. శనివారం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షంతో.. మళ్లీ నగరం నీట మునిగింది. పలు కాలనీల్లోకి నీరు చేరగా.. చెట్లు నేలకూలాయి. పలు వాహనాలు నాశనం అయ్యాయి. గాలులకు, వానకి విద్యుత్‌, రవాణా వ్యవస్థలకు, మంచి నీటి సరఫరాకు విఘాతం ఏర్పడింది.

హైదరాబాద్ లో పలు చోట్ల భారీవర్షం.. వర్షపాత నమోదు ఇలా
షేక్‌పేట లో 10.6 సెం.మీ 
ఖాజగూడ లో 9.6 సెం.మీ 
రామంతపూర్ లో 8.1 సెం.మీ 
మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ లో 8.1 సెం.మీ 
శ్రీనగర్ కాలనీ 8 సెం.మీ 
మాదాపూర్ 7.3 సెం.మీ 
తార్నాక లో 7.1 సెం.మీ 
జూబ్లీహిల్స్ 6.9 సెం.మీ 
మైత్రివనం 6.9సెం.మీ
బంజారాహిల్స్ 6.9 సెం.మీ

ఇదీ చదవండి:  చిన్నారి మౌనిక ఘటన మరువక ముందే.. కుండపోతకు మరో విషాదం

మరిన్ని వార్తలు