పగబట్టిన వరుణుడు: ఇంకెక్కడి దసరా!

19 Oct, 2020 16:01 IST|Sakshi

వరదముంచిన దసరా సరదా

బతుకమ్మ ఆటపాటల జోరేది?

కనిపించని దసరా జోష్ !

(వెబ్‌ స్పెషల్స్‌): ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి... మరోవైపు ప్రకృతి తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తున్నాయి. పండుగల నాటికైనా చక్కబడతామనుకున్న జనావళికి తీవ్ర నిరాశే ఎదురైంది. అటు కోవిడ్-19 ఆంక్షలు,  ఇటు పగబట్టిన వరుణుడు దిక్కుతోచని స్థితి. ప్రధానంగా హైదరాబాదు నగరంలో ఎటునుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అంతుపట్టక నగర వాసులు బిక్కు బిక్కుమంటున్నారు. ఎడతెగని వర్షాలు, వరదలతో  2020 దసరాలో పండుగ వాతావరణమే కనిపించకుండా పోతోంది.

దసరా అంటేనే సరదా. విజయానికి సూచికగా మాత్రమే విజయాలను సమకూర్చే పండుగగా విజయదశమి ప్రతీతి. కొత్తబట్టలు, సరికొత్త వాహనాలు, కొంగొత్త ఆశలతో ఈ పండుగ బోలెడంత సంబురాన్ని మోసు కొచ్చేది. కానీ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అటు కరోనా, ఇటు ప్రకృతి ప్రకోపం భక్తుల దసరా ఉత్సవాలపై నీళ్లు జల్లాయి. అంతేకాదు పండుగ సీజన్ పై కోటి ఆశలు పెట్టుకున్న వ్యాపారులను కూడా ఘోరంగా దెబ్బతీశాయి. పండుగ  సందర్బంగానైనా కొద్దో గొప్పో వ్యాపారం జరిగి,  కాస్త తెప్పరిల్లుదామనుకున్న చిన్న, పెద్ద వ్యాపార వర్గం ఆశలను అడియాసలు చేసేసాయి.

దసరాలో మరో సంబురం బతుకమ్మ. శీతాకాలపు తొలి రోజుల ప్రకృతి సౌందర్యంలో పువ్వుల రాశినే దేవతామూర్తిగా భావించి పూజ చేయడం ప్రత్యేక విశేషం. ఇది తెలంగాణ ఆడపడుచుల పూల సంబురం. గునుగు, తంగేడు పూలు బంతి, చేమంతి, నంది వర్ధనంలాంటి రంగు రంగుల పూలను తీర్చి..బతుకవమ్మా అంటూ దీవించే అపురూప దృశ్యం. కానీ 2020 దసరా మాత్రం దేశవ్యాప్తంగా ప్రదానంగా తెలంగాణా  ప్రజలకు ఒక చేదు జ్ఞాపకాన్నే మిగులుస్తోంది. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఆనందంగా ఎదురుచూసే సంబురం బతుకమ్మ. ఈ శరన్నవరాత్రుల్లో బతుకమ్మ ఆటపాటల ఉత్సాహం, కోలాహల వాతావరణం కన్నుల పండువగా ఉంటుంది. జమిలిగా, లయబద్ధంగా చప్పట్లతో, కోలాటాలతో ఎంతో సందడి చేస్తారు. ఏడాదికి సరిపడా స్ఫూర్తిని పొందుతారు. ప్రస్తుతం అంతటి ఉత్సాహం, కోలాహలం, సందడి ఎక్కడా కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. ఎవరికి వారే చాలా పరిమితంగా బతుకమ్మలాడుతూ మళ్లీ ఏడాదైనా తమ కష్టాలు తీరేలా చూడు తల్లీ అంటూ ఆ  గౌరమ్మకు మొక్కుతున్నారు. 

కనిపించని దసరా జోష్‌
గత ఏడు నెలలుగా స్థబ్దుగా ఉండి, లాక్ డౌన్ అంక్షల  సడలింపు తరువాత  కూడా పెద్దగా డిమాండ్ లేక వెలవెల బోయిన వ్యాపార వాణిజ్య సంస్థలు  పండుగ సీజన్ బిజినెస్ పై చాలా ఆశలు పెట్టుకున్నాయి. అటు భారీ డిస్కౌంట్లు, తగ్గింపు ఆఫర్లు, ఉచిత ఆఫర్లు అంటూ ఇలా రకరకాల పేర్లతో కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు వ్యాపార సంస్థలూ సిద్ధమైనాయి. ఆ మేరకు కొద్దిగా మార్కెట్‌లో సందడి నెలకొంది. పల్లె, పట్టణ ప్రాంతల్లో నూతన వస్త్రాల కొనుగోళ్లు, ఇతర ఎలక్ట్రానిక్, గృహోపకరణాలు, వాహనాలు, ఇతర వస్తువుల కొనుగోళ్ల జోరు అందుకుంది. కానీ ఇంతలోనే భారీ వర్షాలు పరిస్థితిని అతాలకుతలం చేసేశాయి.   క్యుములో నింబస్ మేఘ గర్జనలు నగర వాసులను వణికించాయి.  దీంతో మొదట్లో నెలకొన్న దసరా జోష్  కనుమరుగు కావడంతో  వ్యాపారులు  డీలాపడిపోయారు. 

సందడి లేని మార్కెట్లు 
దసరా, బతుకమ్మ పండుగ అంటూనే పూలపండుగ. అద్భుతమైన పూల జాతర. ప్రధానంగా బంతి, చేమంతి, లాంటివాటితోపాటు, గునుగు, తంగేడు, నంది వర్ధనం, గుమ్మడి పూలు లాంటివాటికి డిమాండ్ ఉంటుంది. రకరకాల, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చడంతోపాటు ప్రతి ఇంటిని అందంగా పూలతో అలంకరించడం ఆనవాయితీ. ఇంటి గుమ్మాలేకాదు.. ఏ చిన్నకార్యాలయం గేటు చూసినా.. విరబూసిన పూల అలంకరణలతో కళకళలాడుతుంటాయి.  అలాగే విజయదశమి రోజున దాదాపు ప్రతి ఇంట్లో, కార్యాలయాల్లో ఆయుధ పూజలు నిర్వహించడం పరపరంగా వస్తోంది. తీరైన గుమ్మడికాయలను కొట్టడం విజయదశమి రోజున అందరూ చేస్తుంటారు. ఇక బొమ్మల కొలువు సరేసరి. 

కానీ పూలు, పూల దండలు, నిమ్మకాయలు, రకరకాల బొమ్మలను విక్రయించే విక్రయదారులు గిరాకీ లేక నీరుగారి పోయారు. దశమి రోజుకు డిమాండ్ పుంజుకుంటుందన్న ఆశలు అంతంతమాత్రమే. ముంచెత్తిన వానలు, కట్టలు తెగిన చెరువులు, పొంగిన నాలాలు దసరా పండుగ అనే మాటనే మర్చిపోయేలా చేశాయి. ప్రాణాలరచేతిలో పెట్టుకుని, పిల్లాపాపలతో బతుకుజీవుడా కాలం వెళ్ల దీస్తున్న దయనీయ స్థితి. ఎపుడు ఏవైపు నుంచి మబ్బులు కమ్మేస్తాయో తెలియదు..ఎటునుంచి వరద ముంచుకొస్తుందో తెలియని గందరగోళ పరిస్థితులలో నగర ప్రజ కాలం వెళ్లదీస్తోంది. దీంతో నగర వ్యాపారంపైనే ఎక్కువగా ఆధారపడే గ్రామీణ విక్రేతలు, చిన్న వ్యాపారస్తులు మరింత సంక్షోభంలో పడిపోయారు. 

బోసిపోయిన షాపింగ్ మాల్స్
పండుగ వచ్చిందంటే పిల్లాపాపలకు కొత్తబట్టల సందడి. దీంతో దసరా, దీపావళి పండుగలకు ఇసుక వేస్తే రాలనంతగా పలు షాపింగ్ మాల్స్ కిటకిట లాడిపోయేవి. ఒక దశలో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయ్యేంతగా కొనుగోలు దారులు బారులు తీరేవారు. కానీ ఏడాది దసరా పండుగ సందర్భంగా  సీన్ రివర్స్. కొనుగోలుదారులు లేక షోరూంలు బోసిపోయాయి. అసలే కోవిడ్-19 దెబ్బకు దిగాలు పడిన వ్యాపారులు ఈ వరదలతో మరింత బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయో, ఎప్పటికి వ్యాపారం పుంజుకుంటుందో తెలియని అయోమయం. అయితే చెడుపై మంచి విజయం సాధించినట్టుగా,  అజ్ఞాతవాసానికి స్వస్తి చెప్పిన పాండవులను విజయం వరించినట్టుగా తమకూ మంచిరోజులు రావాలని పిల్లాపెద్దా వేయి దేవుళ్లకు మనసులోనే మొక్కుతున్నారు. 

మరిన్ని వార్తలు